Share News

ఎంపీ ఎన్నికల్లో తగ్గుతున్న ఓటింగ్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:58 PM

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదవుతోంది.

ఎంపీ ఎన్నికల్లో తగ్గుతున్న ఓటింగ్‌
ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయిస్తున్న అదనపు కలెక్టర్‌ అపూర్వచౌహాన్‌ (ఫైల్‌)

- ఓటు వేసేందుకు ఆసక్తి చూపని ఓటర్లు

- పోలింగ్‌ శాతం పెంచేందుకు అధికారుల యత్నాలు

గద్వాల న్యూటౌన్‌, ఏప్రిల్‌ 19 : పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదవుతోంది. అసెంబ్లీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచు ఎన్నికలతో పోల్చితే, పార్లమెంట్‌ ఎన్నికల సందడి కూడా తక్కువగానే ఉంటుంది. దీనికి తోడు ఓటు వేసేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం ఓటర్లు 4,94,945 మంది ఉన్నారు. ఇందులో గద్వాల నియోజకవర్గంలో 2,55,866 మంది ఉన్నారు. వారిలో పురుషులు 1,25,356, మహిళలు 1,30,499, ట్రాన్స్‌జెండర్లు 11 మంది, 85 సంవత్సరాలు పైబడిన వారు 1,688, వికలాంగులు 4,588 మంది ఉన్నారు. అలంపూర్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,39,079 మంది కాగా, వారిలో పురుషులు 1,17,997, మహిళలు 1,21,074, ట్రాన్స్‌జెండర్లు ఎనిమిది మంది ఉన్నారు. 85 సంవత్సరాలు పైబడిన వారు 1,832, వికలాంగలు 6,216 మంది ఉన్నారు.

తగ్గుతున్న ఓటింగ్‌

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గుతోంది. గతంలో జరిగిన ఎంపీ ఎన్నికల ఓటింగ్‌ వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2014 ఎన్ని కల్లో గద్వాల నియోజకవర్గంలో 70.73 ఓటింగ్‌ శాతం నమోదు కాగా, అలంపూర్‌ నియోజకవర్గంలో 65.23 శాతం మాత్రమే నమోదయ్యింది. 2019 పార్లమెం ట్‌ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గంలో 66.38 శాతం, అలంపూర్‌ నియోజకవర్గంలో 63.77 శాతం ఓటింగ్‌ నమోదు అయ్యిం ది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజక వర్గంలో 83,12 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, అలంపూర్‌ నియోజకవర్గంలో 82.50 శాతం నమోదు అయినట్లు అధికారులు చెప్తున్నారు.

విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

ఈ సారి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా, రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటు ప్రాధాన్యంపై ప్రతీ కళాశాలలో యువ ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో 5కే రన్‌ నిర్వహిం చారు. అలాగే వాల్‌రైటింగ్‌ కూడా చేయిస్తున్నారు. క్యాంపస్‌ అంబాసిడర్లను నియమించి విద్యార్థులకు ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. మండలాలు, మునిసిపాలిటీల్లో మహిళా సంఘాల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేస్తున్నారు. బూత్‌ లెవల్‌లో బీఎల్‌వోలతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు.

ఓటింగ్‌ శాతం పెంచేందుకు కృషి

కేంద్ర, రాష్ట్ర అధికారుల ఆదేశాలతో ఓటింగ్‌ నమోదు శాతాన్ని పెంచేందుకు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. గ్రామాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తాం. ఓటు వేయడం ప్రతీ పౌరుడి హక్కు.. ఈ హక్కును ప్రతీ ఓటరు సద్వినియోగం చేసుకునేలా మా వంతు కృషి చేస్తాం.

- ఎంపీ రమేష్‌బాబు, స్వీప్‌ నోడల్‌ అధికారి

Updated Date - Apr 19 , 2024 | 10:58 PM