Share News

డెత్‌ స్పాట్‌

ABN , Publish Date - Jul 15 , 2024 | 10:53 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న బురెడ్డిపల్లి టీ జంక్షన్‌ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ తరచూ జరుగుతున్న యాక్సిడెంట్లలో ఎందరో మరణిస్తున్నారు.

డెత్‌ స్పాట్‌
ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో దగ్ధమౌతున్న ఆర్టీసీ బస్సు

ప్రమాదాలకు నిలయంగా బురెడ్డిపల్లి టీ జంక్షన్‌

వాహనాలు రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్లు

అండర్‌పాస్‌ నిర్మాణం చేపట్టాలంటున్న స్థానికులు

జడ్చర్ల, జూలై 15: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న బురెడ్డిపల్లి టీ జంక్షన్‌ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ తరచూ జరుగుతున్న యాక్సిడెంట్లలో ఎందరో మరణిస్తున్నారు. బురెడ్డిపల్లి నుంచి జడ్చర్ల కొత్తబస్టాండు వైపు, అలాగే జాతీయ రహదారి నుంచి బురెడ్డిపల్లివైపు వచ్చే సందర్భంలో జాతీయ రహదారి దాటుతుండగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. మరెందరో గాయపడ్డారు. జాతీయ రహదారిపై వాహనాలు వేగంగా వస్తుండటం, రోడ్డు దాటుతున్న వారు అప్రమత్తంగా వ్యవహరించకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

తప్పిన ప్రాణనష్టం

తాజాగా ఆదివారం అర్దరాత్రి ఇదే బురెడ్డిపల్లి టీ జంక్షన్‌ వద్ద యూ టర్న్‌ తీసుకుంటున్న డీసీఎంను హైదరాబాద్‌ నుంచి ధర్మవరం వెళ్తున్న ఏపీఎస్‌ ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బస్సు డీసీఎంను ఢీకొంటూ అవతలి వైపు రోడ్డు కిందకు వెళ్లిపోయింది. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణీకులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు ఇంజన్‌లోంచి పొగలు రావడంతో అప్రమత్తం అయిన ప్రయాణికులు బస్సు అత్యవసర ద్వారంతో పాటు కిటికీల్లో నుంచి కిందకు దిగారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు స్టీరింగ్‌ వద్ద ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను స్థానికులు, ప్రయాణికులు కష్టపడి బయటికి దించారు. తర్వాత ఇంజన్‌లో నుంచి మంటలు వచ్చి, బస్సు మొత్తం దగ్ధమైంది. ప్రయాణికులు ముందే దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు స్థానం లో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఉంటే ప్రమాద తీవ్ర త మరోలా ఉం డేదని చర్చ జరుగుతోంది. ఎయిర్‌కండిషన్‌తో నడిచే ఆ బస్సులకు అత్యవసర ద్వారం ఉన్నా.. కిటికీ అద్దాలను పగులగొట్టేందుకు ప్రయాణికులు శ్రమించాల్సి వచ్చేదని, ఆలోగా మంటలు వ్యాపించి ప్రయాణికులు మృతి చెందేవారని చర్చించుకుంటున్నారు.

అండర్‌పాస్‌ నిర్మాణానికి డిమాండ్‌

బురెడ్డిపల్లి టీ జంక్షన్‌ వద్ద ఫ్లై అండర్‌పాస్‌ నిర్మించాలన్న స్థానికుల డిమాండ్‌ నెరవేరడం లేదు. ఈ జంక్షన్‌ వద్ద తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, అండర్‌పాస్‌ నిర్మిస్తే ప్రమాదాలు జరుగవని ఇప్పటికే పలు పర్యాయాలు ప్రజాప్రతినిధులను, అధికారులను స్థానికులు కోరారు. జాతీయ రహదారి కావడంతో అండర్‌పాస్‌ నిర్మాణం కోసం ఎన్‌హెచ్‌ఐఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు.

బ్లాక్‌ స్పాట్‌గా గుర్తింపు

వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో బురెడ్డిపల్లి టీ జంక్షన్‌ను పోలీసులు ఈ నెల 12న బ్లాక్‌స్పాట్‌గా గుర్తించారు. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై రోడ్డు భద్రత శాఖ డీఎస్పీ సుదర్శన్‌, జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, ట్రాఫిక్‌ సీఐ శ్రీనివా్‌సలు పరిశీలించారు. జంక్షన్‌ వద్ద అండర్‌పాస్‌ నిర్మాణం చేపట్టాల్సిన అవశ్యకత ఉందని గుర్తించారు. ప్రమాదాలను నివారించేందుకు జంక్షన్‌ మూసివేయాలనే ప్రతిపాదనను పరిశీలించేందుకు ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

గతంలో జరిగిన ఘటనలు

  • నాగర్‌కర్నూల్‌ జిల్లా నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీను(40) బురెడ్డిపల్లి టీ జంక్షన్‌ వద్ద ఈ నెల 10న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై జంక్షన్‌ వద్ద రోడ్డు దాటుతుండగా బొలేరో వాహనం ఢీ కొట్టింది. శ్రీను కడుపుపై వాహనం టైర్లు ఎక్కడంతో పొట్ట పగిలి, అవయవాలు బయటపడ్డాయి. అతన్ని చికిత్స కోసం జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు.

  • జడ్చర్ల మునిసిపాలిటీలోని పాతబజారుకు చెందిన ఆంజనేయులు(50) గత నెల 27న జడ్చర్ల కొత్తబస్టాండు సమీపంలోని ఓ హోటల్‌ భోజనం చేశాడు. తిరిగి ఇంటికి బురెడ్డిపల్లి టీ జంక్షన్‌ మీదుగా వెళ్తుండగా, ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతను అక్క డే మృతి చెందాడు.

  • హరితహారంలో భాగంగా ఏడాదిన్నర కిందట జాతీయ రహదారిపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. జడ్చర్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలను గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో జాతీయ రహదారి వద్దకు తెచ్చారు. జంక్షన్‌ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కంటైనర్‌ ఢీ కొట్టడంతో జడ్చర్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.

బాలానగర్‌ నుంచి గంగపూర్‌ వరకు డబుల్‌ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు; చిత్రంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జీఎంఆర్‌

Updated Date - Jul 15 , 2024 | 10:53 PM