కోటి మొక్కలు నాటాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:04 PM
నాగర్‌కర్నూల్ జిల్లాలో కోటి మొక్కలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా అధికారులు అడుగులు వేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని చింతల చెరువు రెవెన్యూ పొలంలో శుక్రవారం 75వ వన మహోత్సవం నిర్వహించారు.

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
మన్ననూరు వన మహోత్సవంలో పాల్గొన్న దామోదర రాజనర్సింహా.. ఎమ్మెల్యేలు
స్టడీ టూర్‌లో భాగంగా పర్యాటక ప్రాంతాల సందర్శన
మన్ననూర్/అచ్చంపేట/దోమలపెంట, జూలై 5: నాగర్‌కర్నూల్ జిల్లాలో కోటి మొక్కలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా అధికారులు అడుగులు వేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని చింతల చెరువు రెవెన్యూ పొలంలో శుక్రవారం 75వ వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూపల్లితో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. జూపల్లి జామ మొక్క, దామోదర రాజనర్సింహ రావి మొక్కలను నాటారు. ఎమ్మెల్యేలు ఒక్కో మొక్కను నాటారు. ఈ సందర్భంగా పాటలు పాడిన జానపద కళాకారులను మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను జానపద కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్న 543 మంది కళాకారులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని వారు విన్నవించారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి దామోదర రాజనరసింహ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ జిల్లాలో 40 లక్షల మొక్కలను వన మహోత్సవంలో నాటాలని లక్ష్యం పెట్టుకోగా, కోటి మొక్కలు పెంచేలా ప్రతీ అధికారి కృషి చేయాలని చెప్పారు. అనంతరం నల్లమలను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దాలన్న సీఎం సూచన మేరకు స్టడీ టూర్‌లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులో ఫరహాబాద్ చౌరస్తా వరకు వెళ్లారు. అక్కడి నుంచి సఫారీ వాహనాల్లో పర్యాటక ప్రాంతాలను చూసేందుకు పోయారు. ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. ఎమ్మెల్యేలు, అటవీ, ఇతర ముఖ్య అధికారులను మాత్రమే స్టడీ టూర్‌కు అనుమతించారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, అటవీశాఖ క్షేత్ర సంచాలకులు(ఎ్‌ఫడీ)శివాని డోగ్ర, డీఎ్‌ఫవో రోహిత్ గోపిడి, ఎంపీడీవో మోహన్‌లాల్, తహసీల్దార్ సరిత, నాయకులు పాల్గొన్నారు.
పర్యాటకులను రప్పించడంలో విఫలం
రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్న నల్లమలకు పర్యాటకులను రప్పించడంలో గత పాలకులు విఫలమయ్యారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని, తద్వారా యువతకు ఉపాధి లభించడంతో పాటు రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరుతుందని అన్నారు. ఉమ్మడి జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జూపల్లి, దామోదర రాజనరసింహ శుక్రవారం ఉమామహేశ్వరం ఆలయాన్ని, నిరంజన్ షావలీ దర్గాను దర్శించుకున్నారు. నల్లమలను టూరిజంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం, ఫారెస్టు శాఖల సంయుక్తంగా పీపీపీ పద్ధతి ద్వారా ఆదాయం పెంచే కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. వారి వెంట జిల్లా అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు.
T
మల్లెలతీర్థం జలపాతం వద్దకు..
నల్లమల అభయారణ్య ప్రాంతంలోని మల్లెల తీర్థం జలపాతాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సందర్శించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.