Share News

అలంపూర్‌ ఆలయాల అభివృద్ధికి సహకారం

ABN , Publish Date - Jan 09 , 2024 | 10:47 PM

అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఐదో శక్తిపీఠం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ భగేల్‌ అన్నారు.

అలంపూర్‌ ఆలయాల అభివృద్ధికి సహకారం
జోగుళాంబ ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడుతున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ బగేల్‌

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ భగేల్‌

అలంపూర్‌ చౌరస్తా, జనవరి 9: అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఐదో శక్తిపీఠం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ భగేల్‌ అన్నారు. మంగళవారం ఆయన ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయన పుర్ణకుంభంతో స్వాగతం పలికారు. మొదట స్వామివారి సన్నిధిలో, తర్వాత అమ్మవారి సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రికి తీర్థప్రసాదాలు ఇచ్చి, ఆశీర్వాదం అందించారు. ఆలయ చైర్మన్‌ శేష వస్త్రాలతో పాటు, అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. ఆలయ విశిష్టతలను అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌ వివరించారు. అనంతరం సత్యపాల్‌ సింగ్‌ భగేల్‌ విలేకరులతో మాట్లాడారు. ఆలయాల అభివృద్ధిపై ఇక్కడి పాలక మండలి, అధికారులు డీపీఆర్‌ అందజేస్తే సంబంధిత శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు అతి తక్కువ వేతనానికే పని చేస్తున్నారని, వారంటే తనకు ఎనలేని గౌరవమన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు, వేతన పెంపునకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, సీఐ రాజు, తహసీల్దార్‌ మంజుల, ఆలయ చైర్మన్‌ చిన్న కృష్ణయ్య, ఆలయ ఈవో పురేందర్‌కుమార్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, మానవపాడు మండల అధ్యక్షుడు మురళీకృష్ణ, జనరల్‌ సెక్రటరీ గుజ్జుల లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బీచుపల్లిలో పూజలు

ఎర్రవల్లి : ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎస్పీ సింగ్‌ భగేల్‌ మంగళవారం పూజలు చేశారు. ఆయనకు ప్రధాన అర్చకుడు మారుతీచారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం మంత్రికి శేషవస్త్రాలను అందించారు.

Updated Date - Jan 09 , 2024 | 10:47 PM