Share News

అభివృద్ధికి సహకరించాలి

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:10 PM

‘జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్‌ యంత్రాంగానికి, మీడియా సిబ్బందికి ధన్యవాదాలు. జిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ సహకరించాలి’ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ అన్నారు.

అభివృద్ధికి సహకరించాలి
కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తున్న అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ తదితరులు

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో అదనపు కలెక్టర్‌

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌ ), జూన్‌ 2: ‘జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్‌ యంత్రాంగానికి, మీడియా సిబ్బందికి ధన్యవాదాలు. జిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ సహకరించాలి’ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఆవరణలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగుర వేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలుపంచుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంలో ప్రాణాలు త్యాగం చేసిన అమర వీరులకు నివాళులు అర్పించారు. లోకసభ ఎన్నికల్లో 72 శాతం ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం జిల్లాకు గర్వకారణమన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన జిల్లా ప్రజలు, అన్ని స్థాయిల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌ రెడ్డి, అదనపు ఎస్పీ రాములు, జిల్లా రెవెన్యూ అధికారి కేవీవీ రవికుమార్‌, విద్యాశాఖ అధికారి రవీందర్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి శంకర్‌, ఎన్‌ఐసీ సత్యనారాయణ మూర్తి, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌ గౌడ్‌, అన్ని శాఖల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అమరులకు నివాళులు అర్పించిన కలెక్టర్‌ రవినాయక్‌

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కలెక్టర్‌ జి.రవినాయక్‌ జిల్లా కేంద్రలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద పూలమాల ఉంచి, నివాళులు అర్పించారు. కలెక్టర్‌తో పాటు మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ అబ్జర్వర్‌ ఏ.వాణీప్రసాద్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, ఆయా శాఖల అధికారులు నివాళులు అర్పించారు.

Updated Date - Jun 02 , 2024 | 11:11 PM