Share News

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

ABN , Publish Date - May 16 , 2024 | 11:22 PM

కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్‌ డ్యాం నుంచి గతనెల తొమ్మిదో తేదీన దిగువకు నీరు వదలడంతో గురువారం ఉదయం జూరాల ప్రాజెక్టుకు 2,451 క్యూసెక్కుల నీరు చేరింది.

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువ వైపు వస్తున్న నీరు

- ప్రధాన ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్దకు చేరిన నీరు

అమరచింత, మే 16 : కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్‌ డ్యాం నుంచి గతనెల తొమ్మిదో తేదీన దిగువకు నీరు వదలడంతో గురువారం ఉదయం జూరాల ప్రాజెక్టుకు 2,451 క్యూసెక్కుల నీరు చేరింది. జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమకాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద భారీగా నీరు వచ్చి చేరుతోంది. హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ఉదయమే మూడించుల పైచిలుకు నీరు చేరినట్లు అధికారుల ద్వారా తెలిసింది. జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమకాలువ పక్కనే ఉన్న ప్రాజెక్టు అనుసంధాన కాలువ(ప్యారలల్‌ కెనాల్‌) వైపు నీరు భారీగా చేరుతోంది. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 2.909 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ కన్నా రెట్టింపు అంటే 2,451 క్యూసెక్కుల నీరు అదనంగా ప్రాజెక్టుకు చేరింది. మరో 12 గంటల పాటు కర్ణాటక ప్రభుత్వం వదిలిన నీరు ప్రాజెక్టుకు వచ్చే అవకాశం ఉంది. నీటి రాకతో ఈ ప్రాంతంలో ఏర్పడిన తాగునీటి ఇబ్బందులు తీరే అవకాశాలు ఉన్నాయి. జూరాల ఎన్టీఆర్‌ ఎడమకాలువ లేక అనుసంధాన కెనాల్‌ ద్వారా తాగునీటి అవసరాల కోసం అధికారులు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో కొనసాగుతోందని ప్రాజెక్టు అధికారులు బీచుపల్లి, ఆంజనేయులు తెలిపారు.

Updated Date - May 16 , 2024 | 11:22 PM