Share News

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:31 PM

ఖిల్లాఘణపురం మండలంలో శుక్రవారం నిర్వహించిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభాలు, ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలు రసాభసాగా మారాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు, బీఆర్‌ఎస్‌ నాయకుల పరస్పర విమర్శలు.. నిందారోపణలతో తోపులాటకు దారితీసింది.

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌
వాగ్వాదానికి దిగిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు

వనపర్తి ఎమ్మెల్యే సమక్షంలో వాగ్వాదం

వనపర్తి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఖిల్లాఘణపురం మండలంలో శుక్రవారం నిర్వహించిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభాలు, ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలు రసాభసాగా మారాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు, బీఆర్‌ఎస్‌ నాయకుల పరస్పర విమర్శలు.. నిందారోపణలతో తోపులాటకు దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి, వివాదం సద్దుమణిగించారు. ఖిల్లాఘణపురం మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పర్యటించారు. మొదట అల్లమాయిపల్లిలో సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్థానిక బీఆర్‌ఎస్‌ ఎంపీపీ కృష్ణనాయక్‌.. ఇదివరకే శంకుస్థాపన చేసిన సబ్‌స్టేషన్‌కు మళ్లీ ఎలా చేస్తారని అడ్డుతగిలారు. గతంలో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు స్థలం గుర్తించకుండానే శంకుస్థాపన చేశారని, ఇప్పుడు స్థలం గుర్తించి భూమిపూజ చేస్తున్నామని సింగిల్‌ విండో డైరెక్టర్‌ సాయిచరణ్‌రెడ్డి తెలిపారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకోగా.. విద్యుత్‌ శాఖ అధికారులు కలగజేసుకున్నారు. సబ్‌స్టేషన్‌ పూర్తయిన తర్వాత పాత శిలాఫలకాన్ని కూడా ఇక్కడకు తెచ్చి పెడతామని చెప్పడంతో వివాదం సమణిగింది. ఆ తర్వాత రోడ్డుమీద తండా గ్రామంలో పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అక్కడే ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ముందుగా మాట్లాడిన ఎంపీపీ కృష్ణనాయక్‌.. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హయాంలో మండలానికి సాగునీరు వచ్చిందని, తండాలు పంచాయితీలు కావడంతో గ్రామస్వరాజ్యం వచ్చిందని చెప్పారు. దీంతో ప్రస్తుత కార్యక్రమంపై మాట్లాడకుండా తమ గొప్పలు మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వ పాలన వల్లే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నిరంజన్‌రెడ్డి 25 వేల ఓట్లతో ఓడిపోయింది మరిచిపోయారని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎద్దేవా చేశారు. దాంతో ఇరుపార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా తనదైన శైలిలో ఎంపీపీకి కౌంటర్‌ ఇచ్చారు. ఎంపీపీ మాట్లాడినప్పుడు తాను మాట్లాడలేదని, తాను మాట్లాడేటప్పుడు గొడవ చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. అయినా ఇరుపార్టీల కార్యకర్తలు అప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ తోపులాటకు దిగారు. ఇదే సమయంలో జడ్పీచైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి కూడా తనను సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ఆహ్వానించకుండా ప్రొటోకాల్‌ పాటించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ, జడ్పీటీసీ, పీఏసీఎస్‌ చైర్మన్‌లను పోలీసులు బయటకు తీసుకెళ్తుండగా.. జడ్పీచైర్మన్‌ అడ్డుపడి, వారిని ఎందుకు బయటకు పంపుతున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఆ తర్వాత కార్యక్రమం యధావిధిగా సాగింది. తర్వాత ఎమ్మెల్యే, జడ్పీచైర్మన్‌, ఎంపీపీలు సమావేశమయ్యారు. ఏం మాట్లాడుకున్నారో తెలియకున్నప్పటికీ కార్యక్రమం వివాదాల మధ్యలో ముగిసింది. వాస్తవానికి ఎమ్మెల్యే కార్యక్రమంలో గొడవ చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు ముందు నుంచి ప్రణాళిక చేసుకున్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే మేఘారెడ్డి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తుండటంతో అడ్డుకోవాలన్న నిర్ణయం మేరకే ఈ రభస చేసినట్లు సమాచారం.

Updated Date - Jan 05 , 2024 | 11:31 PM