Share News

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:41 PM

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు
మాట్లాడుతున్న బీజేపీ పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

- అప్పులు ఉన్నాయని తెలిసినా అలవికాని హామీలు

- రైతుల పంటలు ఎండిపోతుంటే రాజకీయాలపై దృష్టి

- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

మహబూబ్‌నగర్‌/మహబూబ్‌నగర్‌ (క్లాక్‌టవర్‌) : ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ సత్యాగ్రహ దీక్షల్లో ఆమె ప్రసంగించారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బీజేపీ ఎండగడుతుంటే అప్పులు ఉన్నాయని తెలిసి కూడా అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు భ్రమ కల్పించి అధికారంలోకి వచ్చిందన్నారు. రైతుల పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్‌ పార్టీ దృష్టి రాజకీయాలపై మాత్రమే ఉన్నదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన హామీ, రూ. 25 వేల పంట నష్ట పరిహారం, రైతు కూలీలకు రూ. 12 వేల భృతి, రైతులకు క్వింటాల్‌ ధాన్యంపై రూ. 500 బోనస్‌పై స్పందించడం లేదని విమర్శించారు. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంతో మాట్లాడి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నీళ్లు తీసుకువచ్చి రైతులకు అందించాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌ పార్టీకి ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. పంట నష్టపోయిన రైతులకు రూ.25 వేలు నష్ట పరిహారం ఇస్తామని నేటికీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు అన్నీ అబద్దమేనా అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 6 వేలు, సబ్సిడీపై రసాయన ఎరువులు, మందుల పిచికారికి డ్రోన్‌లను అందిస్తున్నదని అన్నారు. సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తున్నది మోదీ ప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పీ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు డోకూరు పవన్‌ కుమార్‌ రెడ్డి, జనార్దన్‌ రెడ్డి, అందె బాబాయ్య, విష్ణువర్ధన్‌ రెడ్డి, క్రిష్ణ వర్ధ్దన్‌రెడ్డి, పాండురంగా రెడ్డి, అంజయ్య, బుడ్డన్న, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, బాలత్రిపురాసందరి, సాహితీరెడ్డి, పద్మవేణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:41 PM