Share News

బీజేపీ, బీఆర్‌ఎస్‌.. మధ్యనే పోటీ

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:27 PM

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్లేనని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌ పరిధిలో కాంగ్రె్‌సకు మూడో స్థానమే వస్తుందని, ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, బీజేపీకి మధ్యనే ఉంటుందని స్పష్టం చేశారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌.. మధ్యనే పోటీ
కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్‌; చిత్రంలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు మూడో స్థానమే..

ఆ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే..

పీఆర్‌ఎల్‌ఐకి జాతీయ హోదా తేని డీకే అరుణకు ఓటు వేయొద్దు

రోడ్‌ షోలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్లేనని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌ పరిధిలో కాంగ్రె్‌సకు మూడో స్థానమే వస్తుందని, ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, బీజేపీకి మధ్యనే ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివా్‌సరెడ్డి తరపున కేసీఆర్‌ పాలమూరులో శుక్రవారం రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా క్లాక్‌ టవర్‌ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. పాలమూరు ప్రజలు పొరపాటున కూడా కాంగ్రె్‌సకు ఓటు వేయొద్దన్నారు. కాంగ్రె్‌సకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని గుర్తు చేశారు. వెనుకబడిన ప్రాంతంగా, పేద జిల్లాగా, వలసలు పోయిన జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌లో సాగు, తాగునీటి కోసం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించుకుంటుంటే.. జాతీయ హోదా ఇవ్వాలని వందసార్లు ప్రధాన మంత్రి మోదీకి రాశానని, కానీ ఇవ్వలేదన్నారు. ఐదేళ్లుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ.. పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదాను సాధించలేదని ఆరోపించారు. ఆంధ్రోళ్లు నీళ్లు తరలించుకుపోతుంటే.. పాదయాత్ర చేసిన రఘువీరారెడ్డికి డీకే అరుణ మంగళహారతులు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. అడిగితే తెలంగాణ రాష్ట్ర సాధకుడినైన తనను అనరాని మాటలు అంటోందన్నారు. మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నె శ్రీనివా్‌సరెడ్డిని గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ మొదటి నుంచీ సెక్యులర్‌ పార్టీగా ఉందని, ముస్లిం, మైనారిటీల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వారి కళ్ల ముందు ఉన్నాయన్నారు. ముస్లింలు బీజేపీ మీద కోపంతో కాంగ్రె్‌సకు ఓటు వేయవద్దని కోరారు. పాలమూరులో కాంగ్రె్‌సకు ఓటు వేస్తే.. బీజేపీ గెలవడం ఖాయమన్నారు. అంతకుముందు మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వంలో పాలమూరు సస్యశ్యామలం అయ్యిందని చెప్పారు. వలసలు వాపస్‌ వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పిందని, పింఛన్‌ను రూ.4 వేలు చేస్తామని చేయలేదన్నారు. కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని, పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని అన్నారన్నారు. అది నమ్మి ఓట్లు వేస్తే తులం బంగారం రాలేదని, రూ.2,000 పింఛన్లు రూ.4,000 కాలేదని విమర్శించారు. కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా పరిస్థితి తయారైందన్నారు. కేసీఆర్‌ ఉంటే రోజూ నీళ్లు వచ్చేవని, ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో వారానికోసారి నీళ్లు వస్తున్నాయని ఆరోపించారు.

భారీగా జనం హాజరు.. సభ సక్సెస్‌...

కేసీఆర్‌ పోరుబాటలో భాగంగా పాలమూరు పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాయంత్రం ఏడు గంటలకు జడ్చర్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి వందలాది వాహనాలతో ర్యాలీగా బయల్దేరారు. పిస్తా హౌస్‌ నుంచి భారీ జన సందోహం మధ్య ర్యాలీ క్లాక్‌ టవర్‌ వరకు కొనసాగింది. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, శ్రేణులు రోడ్డు షోకు హాజరయ్యారు. గులాబీ జెండాలు, కాగితపు పూలతో రోడ్డంతా గులాబీమయమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలవడంతో కొంత నైరాశ్యంలోకి వెళ్లిపోయిన బీఆర్‌ఎస్‌ కేడర్‌ను కేసీఆర్‌ పర్యటన ఉత్తేజితులను చేసింది. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే కాస్త ఆలస్యంగా ప్రచారం ప్రారంభించినప్పటికీ.. తాజాగా కేసీఆర్‌ పర్యటనతో ప్రచారం ఊపందుకోనుంది. ఇదిలా ఉంటే.. రోడ్‌ షో అనంతరం కేసీఆర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అక్కడే రాత్రి బస చేసి.. రేపు మధ్యాహ్నం తర్వాత నాగర్‌కర్నూల్‌ రోడ్డు షోకు బయల్దేరి వెళ్లనున్నారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మెహన్‌రెడ్డి, అంజయ్యయాదవ్‌, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌లో రోడ్‌షో

నాగర్‌కర్నూల్‌, (ఆంధ్రజ్యోతి): గులాబీ బాస్‌ కేసీఆర్‌ శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం ఆరు గంటలకు రోడ్డు మార్గం ద్వారా ఉయ్యాలవాడకు చేరుకోనున్న చంద్రశేఖర్‌రావు జిల్లా కేంద్రంలో రెండు కిలో మీటర్ల మేర రోడ్‌ షోలో పాల్గొంటారు. అనంతరం బస్టాండ్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారని అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. రోడ్‌ షోను విజయవంతం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పార్టీ క్యాడర్‌తో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు.

Updated Date - Apr 26 , 2024 | 11:27 PM