Share News

పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం నిధులు

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:25 PM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరో కీలకమైన పురోగతికి మార్గం ఏర్పడింది. పథకానికి కేంద్రం నిధులు ఇవ్వడానికి మార్గం సుగమం అయ్యింది. జాతీయ హోదా అంశంపై నెలకొన్న సందిగ్ధతకూ తెరపడింది.

పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం నిధులు
నార్లాపూర్‌ వద్ద తవ్విన సొరంగం

కేంద్రమంత్రితో సీఎం సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయం

జాతీయ హోదా లేనట్లేనని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

రాష్ట్రం అంగీకరిస్తే 60 శాతం నిధులిచ్చే అవకాశం

రూ.55,082 కోట్లకు చేరిన అంచనా వ్యయం

గత ఏడేళ్లలో చేసిన ఖర్చులు రూ.15,412 కోట్లు

త్వరలో నిర్వహించే సమీక్ష తర్వాత తుది నిర్ణయం అంటోన్న అధికారులు

మహబూబ్‌నగర్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరో కీలకమైన పురోగతికి మార్గం ఏర్పడింది. పథకానికి కేంద్రం నిధులు ఇవ్వడానికి మార్గం సుగమం అయ్యింది. జాతీయ హోదా అంశంపై నెలకొన్న సందిగ్ధతకూ తెరపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఇటీవలి ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో జరిపిన సమావేశంలో ఈ అంశాలపై స్పష్టత వచ్చింది. ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని, కేంద్రం నిధులివ్వాలని కేంద్ర మంత్రిని కోరగా, ఆయన కేంద్రం ఇచ్చే సహాకారంపై స్పష్టత ఇచ్చారు. 2014 తర్వాత జాతీయ ప్రాజెక్టుల విధానాన్ని కేంద్రం అమలు చేయడం లేదని చెప్పారు. అయితే కొన్ని ముఖ్యమైన ఇరిగేషన్‌ పథకాలకు, తాగునీరు, ఫ్లోరైడ్‌ ప్రాంతాలకు నీరిచే ్చ పథకాలకు ప్రాధాన్యత దృష్టా కేంద్రం ప్రధాన మంత్రి జల సంచయ్‌ యోజన పథకం కింద 60 శాతం నిధులిస్తుందని తెలిపారు. ఈ పథకం కింద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సైతం నిధులిచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్పష్టం చేసినట్లు వెల్లడించారు. దీంతో పాలమూరు పథకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ నెలకొన్న వివాదానికి ఇక ఫుల్‌స్టాప్‌ పడ్డట్లేనని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పనులపై త్వరలో పూర్తి సమీక్ష జరిపిన అనంతరం మార్పు చేర్పులతో రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయింపు చేస్తారని, పనుల్లో మళ్లీ వేగం పుంజుకుంటుందని ఇంజనీర్లు వెల్లడిస్తున్నారు.

పెరిగిన అంచనా వ్యయం

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.35 లక్షల ఎకరాలకు సాగు నీరు, 1,226 గ్రామాలకు తాగునీరు, పరిశ్రమలకు నీటి వసతి కల్పించే నిమిత్తం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టును ప్రాథమికంగా రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టారు. ఆ తర్వాత పథకం రూపకల్పనలో జరిగిన మార్పులు, చేర్పులతో అంచనా వ్యయం రూ.55,086 కోట్లకు చేరింది. ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.15,412 కోట్లు నికరంగా ఖర్చు చేసింది. ఈ యేడాది బడ్జెట్‌లోనూ ఈపథకానికి రూ.1187.64 కోట్లు కేటాయించారు. ఈ నిధులు దాదాపు వెచ్చించినట్లేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు నార్లాపూర్‌, ఏదుల, కరివెన రిజర్వాయర్లు దాదాపు 80 శాతం పూర్తయితే, ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం 50 శాతమే పూర్తయ్యింది. మొత్తంగా అండర్‌ టన్నెల్స్‌ పనులు మాత్రం వంద శాతం పూర్తయ్యాయి. ఈ పథకానికి కేంద్రం 60 శాతం నిధులిస్తే సుమారు రూ.33 వేల కోట్ల ఆర్థిక సహాయం అందే అవకాశముంది. అయితే ప్రాజెక్టుపై సమీక్ష అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయం ఆధారంగా కేంద్రం నిధులను తీసుకొని పనులను కొనసాగిస్తారా? లేదా? అనే అంశం తేలనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Jan 08 , 2024 | 10:25 PM