Share News

భవిష్యత్‌ బీఆర్‌ఎస్‌దే..

ABN , Publish Date - Feb 25 , 2024 | 10:50 PM

‘ఒకటిన్నర శాతం ఓట్లతో అధికారం కోల్పోవచ్చు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, ఆ తర్వాత పదేళ్లు అధికారంలో వంద కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లిన కారు సర్వీసింగ్‌కు రావడం సహజమే’నని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు.

భవిష్యత్‌ బీఆర్‌ఎస్‌దే..
నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌

పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌

నాగర్‌కర్నూల్‌(ఆంధ్రజ్యోతి), ఫిబ్రవరి 25: ‘ఒకటిన్నర శాతం ఓట్లతో అధికారం కోల్పోవచ్చు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, ఆ తర్వాత పదేళ్లు అధికారంలో వంద కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లిన కారు సర్వీసింగ్‌కు రావడం సహజమే’నని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లలో ఆదివారం బీఆర్‌ఎస్‌ బూత్‌ కమిటీ సభ్యులతో పార్లమెంటరీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీలను దుయ్యబడుతూనే.. క్యాడర్‌లో మనో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. తెలంగాణకు ఎంతో మంది సీఎంలు రావచ్చని కానీ, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. జనం కేసీఆర్‌ను చిరస్మరనీయంగా తమ హృదయాల్లో పదిల పర్చుకుంటారని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎడారిగా ఉన్న విషయం వాస్తవం కాదా? అని అన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు పథకాల ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేసినందుకు కాంగ్రె్‌సకు కండ్లు మండుతున్నాయని విమర్శించిన ఆయన బీజేపీ పాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదాను కల్పించడం లేదని ఈ ప్రాంత సెంటిమెంట్‌ రగిలించారు.

బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ రాములు డుమ్మా

పార్లమెంటరీ సన్నాహక సమావేశాలకు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ రాము లు డుమ్మా కొట్టారు. కొంతకాలంగా బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రాములుకు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు పొసగడం లేదు. ఇదే క్రమంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని బీఆర్‌ఎ్‌సకు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు రాములుకు టికెట్‌ ఇవ్వొద్దని పార్టీ అధినేత కేసీఆర్‌కు బహిరంగంగా చెప్పారు. దాంతో రాములుకు తిరిగి టికెట్‌ కేటాయించే ఆంశం డైలామాలో పడింది. ఎంపీగా పోటీ చేసేందుకు గువ్వల బాలరాజు ఆసక్తి చూపుతున్న క్రమంలో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కావాలని సిట్టింగ్‌ ఎంపీ రాములును దూరంగా ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - Feb 25 , 2024 | 10:51 PM