నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:11 PM
మండల కేంద్రంలోని భ్రమరాంభికా అడివేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభం కానున్నాయి.

- సిద్ధమైన అడివేశ్వర స్వామి ఆలయం
- ఉత్సవాల్లో భాగంగా రైతు సంబురాలు
రాజోలి, మార్చి 6 : మండల కేంద్రంలోని భ్రమరాంభికా అడివేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. మూడు రాష్ర్టాల ప్రజలు తరలివచ్చే ఈ ఉత్సవాల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మహా శివరాత్రి (జాగరణ)ని పురస్కరించుకొని స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పశువుల క్రయ విక్రయాలు జోరుగా సాగనుండటంతో రైతులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. అందుకు అవసరమైన స్థలాన్ని చదును చేసి సిద్ధం చేశారు. జాతరలో చిరు వ్యాపారాలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. ఆలయానికి, రథానికి రంగులు వేయించి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు.
10 రోజుల పాటు సంబురాలు
మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉదయం తుంగభద్ర నది నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేస్తారు. అనంతరం పంచామృతాభిషేకం, అలంకరణ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భ్రమరాంబికా సమేత అడివేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని కనుల పండవగా నిర్వహిస్తారు. సాయంత్రం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. రాత్రి 11.45 గంట లకు లింగోధ్భవకాల మహా అభిషేకం నిర్వహిస్తారు.
ప్రతీ రోజు ప్రత్యేక కార్యక్రమాలు
ఉత్సవాల్లో భాగంగా 11న ఉదయం 8.00 గంటలకు కలశారోహణం, సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. 12న రాత్రి 8.30 గంటలకు ప్రభోత్సవం ఉంటుంది. 13న రాత్రి గం. 9.00 గంటలకు రాజోలి భజన బృందం వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహించనున్నారు. 14న అంతర్రాష్ట్ర పాలపళ్ల ఎద్దుల బల ప్రదర్శన, 15న సీనియర్ విభాగంలో పశు బలప్రదర్శన ఉంటాయి.16న బిందెసేవ, జలక్రీడలు, నందికోల సేవ నిర్వహించనున్నారు.