Share News

వైభవంగా బీరప్ప బండారు ఉత్సవం

ABN , Publish Date - May 20 , 2024 | 11:11 PM

ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే బీరప్ప జాతర మహోత్సవాలను మండలంలోని సోమేశ్వర్‌బండ, లింగంపల్లి గ్రామాల్లో సోమవారం మాదాసి కురుమలు వైభవంగా జరుపుకున్నారు.

వైభవంగా బీరప్ప బండారు ఉత్సవం
బీరప్ప బండారు ఉత్సవంలో భక్తులపై బండారు చల్లుతున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- పాల్గొన్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- వందలాదిగా తరలివచ్చిన భక్తులు

- పసుపుమయమైన ఆలయ ప్రాంగణం

ఊట్కూర్‌, మే 20 : ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే బీరప్ప జాతర మహోత్సవాలను మండలంలోని సోమేశ్వర్‌బండ, లింగంపల్లి గ్రామాల్లో సోమవారం మాదాసి కురుమలు వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం ఊరి బయిటి గుడి వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బీరప్ప దేవుడికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించారు. అనంతరం గుడి వద్ద హామం నిర్వహించి అన్నదానం చేశారు. బీరప్పను ఇంటి దేవుడిగా కొలిచే వారు కుటుంబ సమేతంగా బండారు మహోత్సవంలో పాల్గొనగా బంఽధువులు పసుపు (బండారు)ను చల్లి ఆశీర్వదించారు. బండారు మహోత్సవంతో ఆలయ ప్రాంగణమంతా పసుపు మయంగా మారింది. ఈ ఉత్సవంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రాష్ట్ర కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవరి మల్లప్ప, బీజేపీ రాష్ట్ర నాయకుడు శంకరోళ్ల రవికుమార్‌ పాల్గొని బీరప్ప, ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బండారు ఉత్సవంలో పాల్గొని పుసుపును చల్లారు. ఈ సందర్భంగా కుర్వకుల పెద్దలు ఎమ్మెల్యేతో పాటు ఇతర నాయకులను సన్మానించారు. అనంతరం సాయంత్రం మళ్లీ హోమం అనంతరం వందలాది భక్తుల నడుమ పల్లకీ సేవలో బీరప్ప స్వామిని గ్రామంలోని గుడికి తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు గణేష్‌కుమార్‌, మాదాసి కుర్వ సంఘం నాయకులు లింగప్ప, టీ లింగప్ప, అచ్చప్ప, ఎల్లప్ప, భగవంతు, కుర్వకుల పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 11:11 PM