Share News

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Aug 20 , 2024 | 11:04 PM

భారీ వర్షాల నేపథ్యంలో వచ్చే ఐదు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ బీఎం.సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం.సంతోష్‌

- కలెక్టర్‌ బీఎం.సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, ఆగస్టు 20 : భారీ వర్షాల నేపథ్యంలో వచ్చే ఐదు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ బీఎం.సంతోష్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్‌ అధికారులనుద్ధేశించి మాట్లాడారు. రానున్న ఐదు రోజులు మరింత వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లా, మండల స్థాయి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలుగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి ధరఖాస్తులు అధిక శాతం పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిశీలించి అర్హత గల దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఆమోదించాలన్నారు. వీడియా కాన్ఫరెన్స్‌లో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు శ్రీనివాసరావు, నర్సింగరావు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు.

పిడుగు పడి చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా కోసం ప్రతిపాదనలు

జిల్లాలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి పిడుగులు పడి ముగ్గురు చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా మంజూరు కో సం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కలెక్టర్‌ బీఎం.సంతోష్‌ మంగళవారం తెలిపారు. అలంపూర్‌ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన వేముల రాజు, గట్టు మండలం అరగిద్ద గ్రామానికి చెందిన తలారి నల్లారెడ్డిలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికి రూ.ఆరు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. అలాగే మల్దకల్‌ మండలంలో కర్నూల్‌ జిల్లా నందవరం కనకవీడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి కూడా పిడుగుపాటుకు మరణించినందున ఎక్స్‌గ్రేషియా మంజూరు కోసం ప్రతిపాదనలను కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌కు పంపామని కలెక్టర్‌ సంతోష్‌ తెలిపారు.

పాఠశాల నిర్మాణం కోసం స్థల పరిశీలన

వడ్డేపల్లి, : ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణం కోసం వడ్డేపల్లి గట్టుపై స్థలాన్ని మంగళవారం కలె క్టర్‌ బీఎం.సంతోష్‌ పరిశీలించారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌జోషి స్థల అవసరాన్ని కలెక్టర్‌కు వివరించారు. అలాగే శాంతినగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ పక్కన ఆరు ఎకరాల వెంచర్‌ను కలెక్టర్‌ పరిశీలించి, సంబంధిత అధికారులతో సమాచారం అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట మునిసిపల్‌ కమిషనర్‌ లక్ష్మారెడ్డి, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - Aug 20 , 2024 | 11:04 PM