భక్తిశ్రద్ధలతో బక్రీద్
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:18 PM
బక్రీద్(ఈద్ ఉల్ జుహా)పండుగను సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, మండలాలు, గ్రామాల్లోని ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు
మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 17: బక్రీద్(ఈద్ ఉల్ జుహా)పండుగను సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, మండలాలు, గ్రామాల్లోని ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రంలోని వానగుట్ట రహెమానియా ఈద్గాలో వేలాది మంది ముస్లింలు నమాజ్ చేశారు. జామియా మసీదు ఇమామ్ మౌలానా హఫీజ్ ఇస్మాయిల్ ఉదయం 8:30 గంటలకు ప్రార్థనలు చేయించారు. పండుగ ప్రాశస్త్యాన్ని వివరించారు. ప్రవక్త ఆచరించిన ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.