Share News

ఉపాధి హామీ పనులపై ఆడిట్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:55 PM

గద్వాల మండల ఉపాధి హామీ పనులపై ఆడిట్‌కు రంగం సిద్ధమైంది. మండలంలో గత ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు రూ..8.76 కోట్ల పనులు నిర్వహించారు.

ఉపాధి హామీ పనులపై ఆడిట్‌
సోషల్‌ ఆడిటర్లతో సమావేశమైన అధికారులు

- పరిశీలన కోసం గ్రామాలకు వెళ్లిన డీఆర్పీలు

గద్వాల, ఏప్రిల్‌ 19 : గద్వాల మండల ఉపాధి హామీ పనులపై ఆడిట్‌కు రంగం సిద్ధమైంది. మండలంలో గత ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు రూ..8.76 కోట్ల పనులు నిర్వహించారు. వాటికి సంబంధించిన రికార్డులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఎస్‌ఆర్‌పీ, డీఆర్‌పీలు శుక్రవారం నుంచి ఆడిట్‌ నిర్వహించేందుకు గ్రామాలకు వెళ్లారు. గద్వాల మండలంలో 28 గ్రామపంచాయతీలు ఉండగా, అందులో రూ.4.85 కోట్లు వేతనాలు, రూ.3.91 కోట్లు మెటీరియల్‌ కాంపోనెంట్‌కు సంబంధించినవి ఉన్నాయి. గత రెండేళ్లకు సంబంధించిన ఉపాధి హామీ పనులపై గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆడిట్‌ నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ ఉండటంతో ఆడిటర్లు, ఉపాధి అధికారుల మధ్య ప్రక్రియ నిర్వహించారు. అప్పట్లో దాదాపు నలుగురు టెక్నికల్‌ అసిస్టెంట్లకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఐదు నెలలు గడవక ముందే మళ్లీ అడిట్‌ నిర్వహిస్తున్నారు. అయితే ఇది గత ఏడాది ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి, ఈ ఏడాది మార్చి 31 వరకు నిర్వహించిన పనులపై ఆడిట్‌ జరుగనున్నది. విలేజ్‌ ఆడిటర్లను ఎంపిక చేసుకున్న డీఆర్పీలు శుక్రవారం నుంచి గ్రామాలకు వెళ్లారు. ఈ నెల 23వ తేదీ వరకు గ్రామాల్లో పనులను పరిశీలిస్తారు. కూలీలను కలిసి మాట్లాడతారు. జాబ్‌ కార్డులు, ఖాతా పుస్తకాలను పరిశీలించి, కూలీ డబ్బు అందుతున్న తీరును తెలుసుకుంటారు. చివరగా 24వ తేదీన బహిరంగ విచారణ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ఎస్‌ఆర్‌పీ, డీఆర్‌పీలు, ఉపాధి అధికారుల మధ్య విచారణ కొనసాగనున్నది.

Updated Date - Apr 19 , 2024 | 10:55 PM