Share News

బండ్ల చంద్రశేఖర్‌రెడ్డిపై దాడి

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:34 PM

కాంగ్రెస్‌ స్థానిక నాయకుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డిపై బుధవారం దాడి జరిగింది. సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, బాధితుడు తెలిపిన వివ రాలిలా ఉన్నాయి.

బండ్ల చంద్రశేఖర్‌రెడ్డిపై దాడి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి

- మల్దకల్‌లో కాంగ్రెస్‌ నాయకుల మధ్యే ఘర్షణ

గద్వాల, ఏప్రిల్‌ 17 : కాంగ్రెస్‌ స్థానిక నాయకుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డిపై బుధవారం దాడి జరిగింది. సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, బాధితుడు తెలిపిన వివ రాలిలా ఉన్నాయి. మల్దకల్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ సరితలు ప్రచార రథం ఎక్కారు. అదే సమయంలో స్థానిక నాయకుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి కూడా రథం ఎక్కబోయారు. ఆయనను కాంగ్రెస్‌ సింగిల్‌విండో డైరెక్టర్‌ పెద్దొడ్డి రామకృష్ణ అడ్డుకున్నారు. ఇతర మండలాల నాయకులకు ప్రచార రథం ఎక్కే అర్హత లేదని చెప్పడంతో చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దొడ్డి రామకృష్ణ ఆయనను బలవంతంగా కిందకు తోసేశాడు. కిందపడబోయిన ఆయన రామకృష్ణ అంగీని గట్టిగా పట్టుకున్నాడు. ప్రతిగా ఆయనపై రామకృష్ణ దాడిచేసి గాయపర్చారు. ఇటీవలే అనారోగ్యం బారినపడి కోలుకున్న ఆయన దెబ్బలకు తాళలేక స్పృహతప్పి పడిపోయాడు. అక్కడే ఉన్న తమ్ముడు రాజశేఖర్‌రెడ్డి ఆయనను గద్వాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. అయితే తన మీదనే దాడి చేశారని పెద్దొడ్డి రామకృష్ణ విలేకరులకు తెలిపారు. సింగిల్‌విండో డైరెక్టర్‌గా ఉన్న తాను ప్రచార రథం ఎక్కబోగా బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి తనను లాగి, దాడి చేయడంతో గాయాలయ్యాయన్నారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

Updated Date - Apr 17 , 2024 | 11:34 PM