Share News

మీ బిడ్డగా అడుగుతున్నా.!

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:52 PM

‘ఇన్నేళ్లు ఎవరెవరికో ఓట్లు వేశారు.. ఎవడెవడో రాజ్యమేలిండు.. ఎవని దగ్గరికో పోయి అయ్యా దేహీ అని అడుక్కునే పరిస్థితి పాలమూరుకు తెచ్చిన్రు.. ఇవాల నేను అడుగుతున్నా.. మీ బిడ్డగా అడుగుతున్నా.. ఇక్కడే పుట్టిన, ఇక్కడే పెరిగిన.. రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా... నల్లమల అడవుల బిడ్డగా.. నల్లమల నుంచి వచ్చిన నేను.. ఈ నేల, ఈ గాలి, ఈ నీరు నాది,

మీ బిడ్డగా అడుగుతున్నా.!
ర్యాలీలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి; చిత్రంలో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ఎమ్మెల్యేలు

పాలమూరులో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులను గెలిపించండి..

జిల్లాపై బాధ, దుఃఖం నాకంటే ఎక్కువ ఎవరికీ ఉండదు

దేశంలోనే ఆదర్శంగా జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది

వంద రోజుల్లోనే పాలమూరుకు రూ. 10వేల కోట్ల నిధులు

అరుణమ్మ గెలిస్తే వారి గడీల్లో బంధువులకే మేలవుతుంది

వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌ కార్నర్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘ఇన్నేళ్లు ఎవరెవరికో ఓట్లు వేశారు.. ఎవడెవడో రాజ్యమేలిండు.. ఎవని దగ్గరికో పోయి అయ్యా దేహీ అని అడుక్కునే పరిస్థితి పాలమూరుకు తెచ్చిన్రు.. ఇవాల నేను అడుగుతున్నా.. మీ బిడ్డగా అడుగుతున్నా.. ఇక్కడే పుట్టిన, ఇక్కడే పెరిగిన.. రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా... నల్లమల అడవుల బిడ్డగా.. నల్లమల నుంచి వచ్చిన నేను.. ఈ నేల, ఈ గాలి, ఈ నీరు నాది, మనది.. మనందరిది.. నాకున్న బాధ, నాకున్న దుఃఖం ఎవరికన్నా ఉంటదా.. ఈ జిల్లా పట్ల ఒక్కసారి ఆలోచన చేయండి.. ఎన్నడైనా.. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్లే.. ఈ పాలమూరు బిడ్డను.. ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది.. నా తరఫున.. మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు చక్కదిద్దడానికి నాకు సొంత మనుషులు కావాలి కదా.. మనవాళ్లు కావాలి కదా మట్టికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు.. మరి ఇంత పెద్ద సమస్యలను పరిష్కరించాలంటే మన ప్రభుత్వం చెప్పినట్లు పనిచేసే వారు కావాలా, వద్దా ఆలోచించాలి, ఈ ప్రభుత్వం మనది.. ఇంకా నాలుగున్నరేళ్లు ఉంటం.. పింఛన్లు కావాలన్నా, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాలు, పెట్టుబడులు తేవాలన్నా, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడే జిల్లాలో రెండు పార్లమెంట్‌, తెలంగాణలో 14 సీట్లు గెలిపించినప్పుడే ప్రయోజనం ఉంటుంది.. అధికారం మన చేతుల్లో ఉంది.. ప్రభుత్వం మన దగ్గర ఉంది.. మన శత్రువు చేతుల్లో కత్తి పెడతే.. వారు పక్కోన్ని పొడవడు.. మనల్నే పొడుస్తరు..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌ ర్యాలీకి హాజరైన ఆయన క్లాక్‌ టవర్‌ వద్ద నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. 60 ఏళ్లు ఉమ్మడి పాలకులు చెరబట్టి.. పడావు పెట్టిన పాలమూరు- రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేశావా? ఏదైనా పరిశ్రమలు పాలమూరుకు తీసుకువచ్చావా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు పేద బిడ్డల చదువు కోసం పాలమూరు యూనివర్సిటీ మంజూరు చేస్తే 150 కొలువులు ఉన్న పీయూలో 130 ఖాళీలను పదేళ్లుగా భర్తీ చేయలేదని విమర్శించారు. ఏం చేయకుండానే పళ్లు ఇకిలించుకుంటూ వచ్చి ఓట్లేయండి.. పార్లమెంట్‌లోపోయి గుర్రు పెట్టి నిద్ర పోతామని అంటున్నారని ఎద్దేవా చేశారు. శ్రీనివా్‌సరెడ్డి మంచోడేనని, గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీని చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్‌ను ఎంపీని చేస్తే ఐదేళ్లు పార్లమెంట్‌లో పల్లెతు మాట్లాడిండా, పీఆర్‌ఎల్‌ఐపై ప్రస్తావన చేసిండా అని ప్రశ్నించారు. మనిషి మంచోడే కానీ మంచానికి పడ్డాడని, లేవడానికి చేతకాదని, లేచినా మాట్లాడే అధికారం లేదని విమర్శించారు. ఐదేళ్లలో అఆలు నేర్చుకోని ఆయనను మరోసారి ఎంపీ అభ్యర్థిగా ఓటు వేస్తే ఏమన్నా లాభమా...? ఓటర్లు ఆలోచన చేయాలని సూచించారు. 60 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీ కులాల జనాభా లెక్కింపు చేస్తున్నామని, నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకమే కాదు.. మెడికల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ, వెటర్నరీ కాలేజీ, డిగ్రీ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ, జూనియర్‌ కాలేజీలు, లా కాలేజీలు మన జిల్లాకు ఇచ్చి పేదలు చదువుకోవడానికి అవకాశం కల్పించామని చెప్పారు. పాలమూరులో కాంగ్రె్‌సను ఓడగొట్టాలని గద్వాల గడీ నుంచి దొరసాని బయల్దేరిందని, గద్వాల గడీల దొరలకైనా, గజ్వేల్‌లో ఫామ్‌హౌజ్‌ దొరలకైనా గడీల ముందట బానిసలుగా బతకదలుచుకోలేదని అన్నారు. కాళ్ల కింద చెప్పుల్లా, నెత్తిన గొడుగులా చేతుల్లో చురకత్తులై అన్నదమ్ములనే పొడుచుకోదలుచుకోలేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ముదిరాజ్‌ బిడ్డను మంత్రిగా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. మాదిగల వర్గీకరణ కోసం పార్లమెంట్‌, సుప్రీం కోర్టులలో కొట్లాడే బాధ్యత తమది అని అన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంలో చేరిన అరుణమ్మ, పదేళ్లు రాష్ట్రంలో కేసీఆర్‌ సీఎంగా ఉన్నారని, ఈ మొనగాళ్లు పాలమూరుకు పది పైసలైనా తెచ్చారా, పీఆర్‌ఎల్‌ఐకి జాతీయ హోదా తెచ్చారా అని ప్రశ్నించారు. కానీ, అరుణమ్మ మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలి పోస్టు తెచ్చుకున్నారని విమర్శించారు. అరుణమ్మ గెలిస్తే గడీల ఉన్న వారి బంధువులకు మేలైతదని, పదవులొచ్చిన వారి కుటుంబానికి మేలైతది తప్పా పాలమూరుకు న్యాయం జరగదన్నారు. కేసీఆర్‌ పిట్టలదొరకు తాత అయ్యారని, తండ్రికి తద్దినం పెట్టనోడు చిన్నాన్నకు కృష్ణానదిలో పిండాలు పెడుతున్నట్లుగా ఆయన శైలి ఉన్నదన్నారు. డిసెంబర్‌లో కేడీని బొందపెట్టినట్లుగానే ఈసారి మోదీని ఓడగొట్టి పాలమూరు పౌరుషాన్ని చూపించాలని పిలుపునిచ్చారు’’. ఏడికి పోయినా నేను చెప్పేది నా అడ్డ, నా గడ్డ పాలమూరు బిడ్డ.. ఆనాడు తట్ట, మట్టి, పార పనికి వలసలు వచ్చినట్లు కాదు. నాయకులమై మీ రాష్ర్టానికి వచ్చాం, నాయకులమై దేశంలోనే గౌరవాన్ని పెంచామని చెబుతున్నా’’ అని అన్నారు. ఈ జిల్లాలో ఇద్దరు వంశీచంద్‌రెడ్డి, మల్లు రవిని చెరో లక్ష మెజారిటీకి తగ్గకుండా గెలిపించాలని, అవకాశం ఉంటే మళ్లీ వస్తానని అన్నారు. సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

కడిగిన ముత్యం వంశీచంద్‌రెడ్డి : సంపత్‌కుమార్‌

చల్లా వంశీచంద్‌రెడ్డి కడిగిన ముత్యంలాంటి వాడని ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్‌ సంపత్‌కుమార్‌ అన్నారు. దయచేసి ఇక్కడి ప్రజలు తప్పు చేయవద్దని, గద్వాలలో తాము అనుభవించామని, డీకే అరుణకు అవకాశం ఇస్తే సారా దందా, ఇసుక దందా, విష్కీ దందా, కిరోసిన్‌ దందా చేస్తారని ఆరోపించారు. ఇక్కడ ఒక పొగరు ఉన్న శ్రీనివా్‌సగౌడ్‌ను ఇంటికి పంపించామని, దేవరకద్రలో మట్టి దందా చేసే వ్యక్తిని ఇంటికి పంపామని, వారి కంటే ఎక్కువ పొగరుతో దందా చేస్తారని విమర్శించారు.

ఎడ్యుకేషన్‌ హబ్‌గా మహబూబ్‌నగర్‌: వంశీచంద్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ జిల్లా ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుతోందని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి చెప్పారు. డీకే అరుణ పార్టీలు మారుతూ అవకాశ వాద రాజకీయం చేయడానికి ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. క్రషర్‌ మిషన్లు పెట్టి కొండలు మింగే వారివైపు ధర్మం ఉంటుందా, మన్యంకొండను అభివృద్ధి చేసే వారివైపు ఉంటుందా అని ప్రశ్నించారు. సారా కాంట్రాక్టర్ల వైపు ధర్మం ఉంటుందా, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టే వారివైపు ఉంటుందా, మన్యంకొండ సాక్షిగా హామీ ఇస్తున్నా ఆశీర్వదిస్తే ప్రజల్లో ఒకరిగా ఉంటూ అభివృద్ధి చేస్తానని చెప్పారు.

Updated Date - Apr 19 , 2024 | 10:52 PM