Share News

సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - May 23 , 2024 | 11:10 PM

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు

సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
గద్వాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న నోడల్‌ అధికారి

- నేటి నుంచి తొమ్మిది కేంద్రాల్లో నిర్వహణ

గద్వాల టౌన్‌, మే 23 : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 2,036 మంది జనరల్‌, 322 మంది విద్యార్థులు వృత్తి విద్య కోర్సు, మొత్తం మొత్తం 2,358 మంది పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,306 మంది పరీక్ష రాయాల్సి ఉంది. మొత్తంగా తొమ్మిది కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 3,664 మంది హాజరు కానున్నారు. గద్వాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, జ్ఞానప్రభ జూనియర్‌ కళాశాల కేంద్రాలతో పాటు అయిజలో రెండు కేంద్రాలు (ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, హరిహర జూనియర్‌ కళాశాల)ల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటితో పాటు ధరూరు, అలంపూర్‌, గట్టు, మానవపాడు కేంద్రా ల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి, పరీక్షల కన్వీనర్‌ హృదయరాజు తెలిపారు. పట్టణంలోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ప్రథమ సంవత్సరం పరీక్ష ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. ప్రతీ కేంద్రంలో ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి విధులు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా కొన సాగేలా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లను నియమించినట్లు వివరించారు.

పాలిసెట్‌కు పూర్తయిన ఏర్పాట్లు

గద్వాల : పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రామ్మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉదయం 10 గంటల్లోపు తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 11 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులు హెచ్‌బీ పెన్సిల్‌, ఎరైజర్‌, షార్ప్‌నర్‌, పెన్ను, హాల్‌ టికెట్‌లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఏమైనా అనుమానాలుంటే సంబంధిత అధికారి శ్రీనివాసులును సంప్రదించాలని సూచించారు. గద్వాల పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో హాల్‌ టెకిట్‌ నంబర్‌ 4404001 నుంచి 4404400 వరకు, బాలికల జూనియర్‌ కళాశాలలలో 4403001 నుంచి 4403280 వరకు కేటాయించినట్లు తెలిపారు. గోనుపాడు పాలిటెక్నిక్‌ కళాశాలలో 4401001 నుంచి 4401250 వరకు, ఎంఏఎల్‌డీ ప్రభుత్వ కళాశాలలో 4402001 నుంచి 4402700 వరకు కేటాయించినట్లు వివరించారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌ నెంబర్‌ను చూసుకొని కేటాయించిన పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు.

Updated Date - May 23 , 2024 | 11:10 PM