అద్దెకు దొరకని అరక
ABN , Publish Date - Aug 25 , 2024 | 10:36 PM
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణ సాగు పెరిగింది.
- యాంత్రీకరణ పెరిగినా అరకతోనే కలుపుతీత
- కాడెడ్లు తగ్గడంతో అరకకు మస్త్ డిమాండ్
- పత్తి చేలల్లో కలుపు తీసేందుకు రైతుల పాట్లు
మరికల్, ఆగస్టు 25 : మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణ సాగు పెరిగింది. దీంతో కాడెడ్లు కనుమరుగయాయి. కురిసిన వర్షాలకు పంటచేలలో కలుపు మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో రైతులు ప్రస్తుతం కలుపు తీత పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా కలుపు నియంత్రణకు కూలీలతో పాటు గుంటుక కొట్టేందుకు అరకల కోసం వెంపర్లాడుతున్నారు. దీంతో కాడెడ్లు ఉన్న అరక కూలీ రైతులకు అమాంతం డిమాండ్ పెరిగింది. దుక్కి దున్నడంతో మొదలు, పంట ఇంటికి చేర్చే వరకు ట్రాక్టర్ వినియోగం పెరిగినా ఒక దశలో రైతులకు కాడెడ్లు అవసరం తప్పడం లేదు. ఎన్ని యంత్రాలు వచ్చినా అరక సాగుకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. పత్తి విత్తనాలు విత్తాలన్నా అరకతో సాళ్లు పట్టాల్సిందే.. పత్తిలో కలుపు నివారణకు అరకతో గుంటుక కొట్టాల్సిందే. నారుమడి కలియ దున్నాలంటే అరక కావాల్సిందే.. నాటు వేసేందుకు కాడెడ్లు అవసరం తప్పని సరి రైతులు పేర్కొంటున్నారు.
అరకకు రూ2,200 వరకు వసూలు
మండల పరిధిలో వందల ఎకరాలలో వివిధ పంటలు సాగు అవుతుం డగా.. ప్రధానంగా పత్తి, వరి సాగు అవుతోంది. గత నెలలో కురిసిన వర్షాలకు పత్తి చేలలో కలుపు మొక్కలు విపరీతంగా పెరగగా, రైతులంతా కలుపు తీత పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఇటు కూలీలలో పాటు అటు గుంటుక కొట్టేందుకు అరక కావాలి. డిమాండ్ పెరగడంతో అరక కూలీ రోజుకు రూ.రెండు వేల నుంచి రూ.2,200 వరకు తీసుకుంటు న్నారు. ఉదయం టీఫిన్, సాయంత్రం మందు ఇచ్చినా అరక దొరకడం లేదని రైతులు వాపోతున్నారు.
గ్రామాల్లో తగ్గిన కాడెడ్లు
ఒకప్పుడు ఏ రైతు ఇంటి ముందు చూసినా కాడెడ్లు, ఎడ్ల బండ్లు దర్శనమిచ్చేవి. ప్రస్తుతం 75శాతం మంది రైతుల ఇళ్ల ముందు ఎడ్ల బం డ్లకు బదులు ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణం గా దిగుబడులు పెంచుకోవడం, శ్రమ తగ్గించుకోవడం, సమయం అదా చేసుకునేందుకు యంత్రాల సాగు చేస్తున్నారు. చేను చదును నుంచి దిగుబడి వచ్చిన పంట అమ్మకానికి మార్కెట్‌కు తరలించే వరకు ట్రాక్లర్లు వినియోగిస్తున్నారు. కానీ ఒకానొక దశలో వాటి అవసరం తప్పడం లేదని రైతులు పేర్కొంటున్నారు. పత్తి చేలలో చెట్ల మధ్య దౌర కొట్టాలంటే ట్రా క్లర్లతో వీలుకాదు. చెట్లు విరిగిపోవడం టైర్ల కింద పడి నలిగిపోవడం జ రుగుతుంది. ఈ క్రమంలో కాడెడ్లతో దౌర కొట్టడం సులభతరంగా ఉంటుందని రైతులు అరకనే ఎక్కువగా వినియోగిస్తున్నారు.