Share News

వీధి కుక్కల నియంత్రణ ఏదీ?

ABN , Publish Date - Nov 25 , 2024 | 11:10 PM

వీధి కుక్కలను అదుపు చేసేవారు లేకపోవడంతో ప్రతీ గ్రామంలో నిత్యం ఎక్కడో ఒకచోట చిన్నారులు, బాటసారులు, మూగజీవాలపై దాడులు చేస్తున్నాయి.

వీధి కుక్కల నియంత్రణ ఏదీ?
కేటీదొడ్డిలో వీధుల్లో తిరుగుతున్న కుక్కలు

- గ్రామాల్లో గుంపులు గుంపులుగా సంచారం

- చిన్నారులు, మూగజీవాలపై దాడి

- పట్టించుకోని అధికారులు

కేటీదొడ్డి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : వీధి కుక్కలను అదుపు చేసేవారు లేకపోవడంతో ప్రతీ గ్రామంలో నిత్యం ఎక్కడో ఒకచోట చిన్నారులు, బాటసారులు, మూగజీవాలపై దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే మండలంలోని చాలా గ్రామాల్లో వీధి కుక్కల కాటుకు గురైన వారి సంఖ్య అధికంగానే ఉంది. దీంతో పాటు ఇళ్ల దగ్గర పెంచుకుంటున్న పశువులు, గొర్రెలు, మేకలపై దాడి చేయడంతో చాలా వరకు మృత్యువాత పడ్డాయి. కేటీదొడ్డి మండల కేంద్రంలో గతంలో వీరన్నకు చెందిన వ్యవసాయ భూమి దగ్గర ఉన్న తన 50 గొర్రె పిల్లలపై వీధి కుక్కలు దాడి చేయడంతో దాదాపు 30 గొర్రె పిల్లలు మృతి చెందాయి. 20 గొర్రె పిల్లలు తీవ్రంగా గాయపడ్డాయి. జయన్నకు చెందిన ఆవుదూడపై దాడి చేయడంతో ఆవుదూడ, మరో రైతుకు చెందిన ఎద్దుపై కూడా దాడి చేయడంతో ఎద్దు మృతి చెందాయి. రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు వెళ్తున్నప్పుడు వీధి కుక్కలు వారిని వెంబడించడంతో భయభ్రాంతులకు గురై వేగంగా వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, మహిళలపై కూడా వీధి కుక్కలు దాడి చేయడంతో వాటిని నియంత్రించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం అధికారులు వీధి కుక్కలను పట్టే వారిని పిలిపించి వీధి కుక్కలను పట్టించి దూర ప్రాంతాల్లో వదిలేశారు. ఆ సమయంలో తప్పిపోయి ఉన్న కొన్ని వీధి కుక్కల సంతతి ఈ ఐదేళ్లలో పెరిగిపోయింది. మండలంలో ఉన్న పెద్ద గ్రామ పంచాయతీల్లో 200 నుంచి 300 పైగానే వీధి కుక్కలు ఉన్నట్లు కేటీదొడ్డి, నందిన్నె, కొండాపురం, పాతపాలెం, కుచినెర్ల గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 11:10 PM