Share News

అమ్మ ఆదర్శ కమిటీలే కీలకం

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:08 PM

పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వాయ్యం ఎంతో అవసరమని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

అమ్మ ఆదర్శ కమిటీలే కీలకం
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల అవగాహన సదస్సులో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

మద్దూర్‌, ఏప్రిల్‌ 8 : పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వాయ్యం ఎంతో అవసరమని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల అవగాహన సదస్సు మద్దూర్‌లోని షాగార్డెన్‌లో సోమవారం జరిగింది. మద్దూర్‌, కోస్గి మండలాల సమాఖ్య అధ్యక్షురాలు, పాఠశాలల ప్రధానోపాఽధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడతూ అమ్మలను పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించి వారే కీలక పాత్ర వహించేందుకు ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్లుగా ఆయా గ్రామ సంఘాల అధ్యక్షురాలు వ్యవహరిస్తారని, కో చైర్మన్లుగా పాఠశాలల ప్రధానోపాఽధ్యాయులు ఉంటారన్నారు. కమిటీలో ప్రతీ తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లులు సభ్యులుగా ఉంటారన్నారు. కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు చోటు కల్పించడం జరుగుతోందన్నారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగుతోందన్నారు. వీటి ద్వార పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన తీర్మాణాలు చేసి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో కిటికీలు, ఎలక్ట్రిక్‌ బోర్డులు, మరుగుదొడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రూ.25 వేల వరకు పాఠశాల కమిటీలే చేసుకోవచ్చు అన్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఎంపీడీవో అనుమతి అవసరమని, ఆ పైగా కలెక్టర్‌ అనుమతితో పనులు చేపట్టడం జరుతుందన్నారు. ఎవరైతే పనులు త్వరితగతిన పూర్తి చేస్తారో వారికే ఇట్టి పనులు అమ్మ ఆదర్శ కమిటీ తీర్మాణాలు ఇచ్చి పనులు అప్పగించడం జరుగుతోందని కలెక్టర్‌ వివరించారు. మద్దూర్‌, కోస్గి మండలాల్లో 55 పనులు ఇంజనీరింగ్‌ అధికారులు గుర్తించడం జరిగిందన్నారు. మద్దూర్‌, కోస్గి మండలాల్లోని 96 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట అకౌంట్‌లు తెరవడం జరిగిందన్నారు. కొడంగల్‌ నియోజకర్గంలో అమ్మ ఆదర్శ కమిటీలు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో కాడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, డీఈవో అబ్దుల్‌ ఘనీ, అడిషనల్‌ ఆర్డీవో అంజయ్య, మద్దూర్‌ ఎంపీడీవో జయ రాములు, తహసీల్దార్‌ మహేశ్‌ గౌడ్‌, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అనిత, కోస్గి మెప్మా అధ్యక్షురాలు శోభ, ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 11:08 PM