Share News

సక్రమంగా తాగునీటి సరఫరా

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:00 AM

జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల పరిధిలో తాగునీరు సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ సంబంఽధిత అధికారులను ఆదేశించారు.

సక్రమంగా తాగునీటి సరఫరా
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు : కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, ఏప్రిల్‌ 16 : జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల పరిధిలో తాగునీరు సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ సంబంఽధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో మంగళవారం మునిసిపల్‌ కమిషనర్లు, మిషన్‌ భగీరథ ఈఈలు, డీఈలతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో ఆయన మాట్లాడారు. వచ్చే రెండు నెలల్లో ప్రజలకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందుస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మునిసిపల్‌ అధికారులు అప్రమత్తంగా ఉంటూ, నీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. ప్రతీ వార్డులో ప్రతీ ఇంటికి మిషన్‌ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. అవసరం మేరకు స్ధానికంగా ఉన్న చేతి, పంపులు, బోర్‌వెల్‌ మోటార్లకు మరమ్మతులు చేయించాలని చెప్పారు. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆదనపు కలెక్టర్‌ అపూర్వచౌహాన్‌, గ్రిడ్‌ ఈఈ భీమేశ్వర్‌రావు పాల్గొన్నారు.

పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతు పనులను వేగవంతం చేసి, జూన్‌ మొదటి వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గుర్తించిన 460 ప్రభుత్వ పాఠశాలల్లో అహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకునేలా సుందరీకరణ పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. 160 పాఠశాలల్లో ‘మన ఊరు - మనబడి’ కింద చేపట్టాల్సిన పనులు కూడా ఉన్నాయని, వాటిని కూడా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో కమిటీలను ఏర్పాటు చేశామని, అవసరమైన పనులను కూడా గ్రౌండింగ్‌ చేశామని ఆయన తెలిపారు. పాఠశాలల్లో తరగతి గదుల మరమ్మతు, మరుగుదొడ్లు, తాగునీరు. విద్యుత్‌ తదితర మౌలిక వసతుల కల్పనను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పూర్తి చేసిన పనులకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో నర్సింగరావు, పంచాయతీరాజ్‌ ఈఈ విజయ్‌కుమార్‌ మిషన్‌ భగీరఽథ ఇంట్రా ఈఈ శ్రీధర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:00 AM