Share News

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - May 29 , 2024 | 10:58 PM

ఫర్టిలైజర్‌ యజమానులు ప్రభుత్వ నిబంధనలకు లోబడే అమ్మకాలు చేపట్టాలని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఏడీఏ దామోదర్‌ హెచ్చరించారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
అమరచింతలోని ఓ ఫర్టిలైజర్‌ షాపులో రికార్డులను తనిఖీ చేస్తున్న ఏడీఏ

- ఫర్టిలైజర్‌ దుకాణ యజమానులను హెచ్చరించిన ఏడీఏ

- అమరచింతలోని రెండు ఫర్టిలైజర్‌ షాపుల్లో విత్తనాల అమ్మకంపై ఆంక్షలు

అమరచింత, మే 29 : ఫర్టిలైజర్‌ యజమానులు ప్రభుత్వ నిబంధనలకు లోబడే అమ్మకాలు చేపట్టాలని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఏడీఏ దామోదర్‌ హెచ్చరించారు. బుధవారం రెండో రోజు అమరచింత, నాగల్‌కడుమూర్‌ ఫర్టిలైజర్‌ షాపులను ఏవో వినయ్‌కుమార్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నందీశ్వర, సాయిసావిత్రి, హనుమాన్‌ ఫర్టిలైజర్‌ షాపుల్లో రికార్డులు, ప్రస్తుతం ఉన్న స్టాక్‌, విత్తనాల సరఫరా, బిల్‌బుక్‌ తదితర వాటిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. సాయిసావిత్రి ట్రేడర్స్‌లో ప్రిన్సిపల్‌ సర్టిఫికెట్‌లో వివరాలు సరిగా లేని కారణంగా లక్ష రూపాయల పైచిలుకు పత్తి విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేశారు. అలాగే హనుమాన్‌ ట్రేడర్స్‌లో సరైన రశీదు లేని కారణంగా 30వేల మిరప విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు ఏడీఏ తెలిపారు. అనంతరం మాట్లాడుతూ నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకోవడంతో పాటు, లైసెన్స్‌ రద్దు చేసి షాప్‌ సీజ్‌ చేస్తామని పేర్కొన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు. అలాగే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన అనంతరం తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

Updated Date - May 29 , 2024 | 10:58 PM