Share News

క్రీడల్లో సత్తా

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:03 PM

క్రీడా రంగంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు పూర్వవైభవం వచ్చింది. 2024లో పతకాల పంట పండింది. జిల్లాలో క్రీడలు నిర్వహించడంతో పాటు క్రీడల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు.

క్రీడల్లో సత్తా
నారాయణపేట జిల్లా గుండుమాల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీల్లో విజేతగా నిచిలిన ఉమ్మడి జిల్లా బాలికల జట్టు(ఫైల్‌)

ఉమ్మడి జిల్లాలో క్రీడా రంగానికి పూర్వ వైభవం

క్రీడల్లో మెరిసిన ఆటగాళ్లు

రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాల పంట

20 ఏళ్ల తరువాత రంజీ జట్టుకు జిల్లా క్రీడాకారుడు

100 మందికి పైగా జాతీయ స్థాయికి

క్రీడా రంగంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు పూర్వవైభవం వచ్చింది. 2024లో పతకాల పంట పండింది. జిల్లాలో క్రీడలు నిర్వహించడంతో పాటు క్రీడల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రాల్లో వివిధ రాష్ట్ర స్థాయి పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. సీఎం కప్‌ పోటీలు పండుగ వాతావరణంలో జరిగాయి. 2024లో ఉమ్మడి జిల్లాలో జరిగిన క్రీడలు, వచ్చిన పతకాలపై ఇయర్‌ రౌండప్‌..

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో 2024లో రాష్ట్ర, జాతీయ, సౌత్‌జోన్‌ క్రీడా పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఆయా పోటీల్లో ఉమ్మడి జిల్లా పలు పతకాలను కైవసం చేసుకుంది. మహబూబ్‌నగర్‌ స్టేడియంలో సౌత్‌జోన్‌ నెట్‌బాల్‌, రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, ఖోఖో, కబడ్డీ, నెట్‌బాల్‌, రగ్బీ, రీజినల్‌ ఫారెస్ట్‌ స్పోర్ట్స్‌ మీట్‌ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వివిధ రాష్ట్ర స్థాయి పోటీలకు వేదిక కాగా, కోస్గి పట్టణం జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు వేదికైంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో..

ఫ మహబూబ్‌నగర్‌ జిల్లా నెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఽధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడియం గ్రౌండ్‌లో ఈ ఏడాది జనవరి 13 నుంచి 16వ వరకు సౌత్‌జోన్‌ ఫాస్ట్‌-5, జాతీయ మహిళ, పురుషుల నెట్‌బాల్‌ చాంపియన్‌షి్‌ప పోటీలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ పుదుచ్చేరి జట్లు పాల్గొన్నాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూలై మూడో తేదీ నుంచి ఆరో తేదీ తేదీ వరకు రాష్ట్రస్థాయి అండర్‌-19 షటిల్‌బ్యాడ్మింటన్‌ పోటీలను ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు.

జూలై 10, 11 తేదీల్లో జిల్లా ఇండోర్‌ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్‌కో, టీజీ డిస్కమ్‌ ఇంటర్‌ సర్కిల్‌ పురుషుల బ్యాడ్మింటన్‌ రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి.

ఆగస్టు 24 నుంచి 26వ తేదీ వరకు జిల్లా స్టేడియం మైదానంలో తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లాల బాల బాలికల-అండర్‌-16 బాస్కెట్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు. పోటీలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి ప్రారంభించారు.

జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబరు 25 నుంచి 27 వరకు స్టేడియం మైదానంలో రీజినల్‌ లెవెల్‌ ఫారెస్ట్‌ స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించారు.

జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్టేడియం మైదానంలో అక్టోబరు 27 నుంచి 30వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లాల బాల, బాలికల ఖోఖో టోర్నీ నిర్వహించారు.

దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో నవంబరు మూడు నుంచి ఐదో తేదీ వరకు స్కూల్‌ గేమ్స్‌ ఫేడరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్‌-17, 19 బాల, బాలికల కబడ్డీ టోర్నీ నిర్వహించారు. అండర్‌-17 విభాగంలో ఉమ్మడి జిల్లా బాలికల జట్టు, అండర్‌-19 విభాగంలో బాలుర జట్టు రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచాయి.

జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో నవంబరు ఎనిమిదో తేదీ నుంచి 10 వరకు ఎస్‌జీఎఫ్‌-19 బాల, బాలికల బాస్కెట్‌బాల్‌ టోర్నీ నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ బాలికల జట్టు రన్నర్‌ నిలిచింది.

స్కూల్‌ గేమ్స్‌ ఫేడరేషన్‌ ఆధ్వర్యంలో జడ్చర్లలో నవంబరు 25 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి అండర్‌-19 బాల, బాలికల ఫుట్‌బాల్‌ టోర్నీ నిర్వహించారు. టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ బాలుర జట్టు రన్నర్‌గా నిలిచింది.

మహబూబ్‌నగర్‌ స్టేడియం మైదానంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నవంబరు 28 నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు రాష్ట్ర స్థాయి అండర్‌-17 బాల, బాలికల రగ్బీ టోర్నీ నిర్వహించారు. బాలికల విభాగంలో ఉమ్మడి జిల్లా జట్టు రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచింది.

మహబూబ్‌నగర్‌ ప్రధాన స్టేడియంలో ఈ నెల 27 నుంచి సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీ ప్రారంభమైంది. 30వ తేదీ వరకు కొనసాగనుంది. 33 జిల్లాల నుంచి 850 మంది క్రీడాకారులు, 150 మంది అఫీషియల్స్‌ పోటీల్లో పాల్గొంటారు. 31వ తేదీ నుంచి రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ టోర్నీ ప్రారంభం కానుంది.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో..

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో నవంబరు 27 నుంచి 29వ తేదీ వరకు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్‌-14, 17, 19 బాల, బాలికల మాల్కం పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా అండర్‌-17 బాలికల విభాగంలో జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలిచింది.

కల్వకుర్తి పట్టణంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 10వ తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్‌-16, 18, 20 బాల, బాలికల, మహిళ, పురుషుల రాష్ట్ర స్థాయి క్రాస్‌ కంట్రీ పోటీలు నిర్వహించారు పోటీలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు.

నారాయణపేట జిల్లాలో...

అక్టోబరు మూడు నుంచి ఐదో తేదీ వరకు ఽధన్వాడ మండల కేంద్రంలోని అప్పాజి మైదానంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఎస్‌జీఎఫ్‌ అండర్‌-14, 17, 19 బాల, బాలికల రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీలు నిర్వహించారు.

డిసెంబరు 10 నుంచి 12వ తేదీ వరకు నారాయణపేట జిల్లా గుండుమాల్‌లో ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 బాల, బాలికల రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నీ నిర్వహించారు. టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా బాల, బాలికల జట్లు విజేతగా నిలిచాయి.

నారాయణపేట జిల్లా కోస్గి పట్టణం ఎస్‌జీఎ్‌ఫఐ అండర్‌-19 బాలుర 68వ జాతీయ స్థాయి వాలీబాల్‌ టోర్నీకి వేదికైంది. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు కోస్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహించారు. 21 రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలో...

స్కూల్‌ గేమ్స్‌ ఫేడరేషన్‌ ఆధ్వర్యంలో గద్వాలలో అక్టోబరు 23 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి అండర్‌-17 బాల, బాలికల తైక్వాండో పోటీలు నిర్వహించారు.

జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంలో డిసెంబరు 15 నుంచి 18వ తేదీ వరకు ఎస్‌జీఎఫ్‌ అండర్‌-14 బాలుర రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. పోటీలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు. టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జట్టు విజేతగా నిలిచింది.

Updated Date - Dec 27 , 2024 | 11:03 PM