Share News

జిల్లాలో వరుస దొంగతనాలు

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:08 PM

జోగుళాంబ గద్వాల జిల్లాలో గత కొన్ని నెలలుగా తరుచూ దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

జిల్లాలో వరుస దొంగతనాలు
బాధితురాలితో మాట్లాడి చోరీ వివరాలను తెలుసుకుంటున్న సీఐ, ఎస్‌ఐ (ఫైల్‌)

- గద్వాల పట్టణంలోనే అధికం

- తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌

- వారంలోనే నాలుగు చోరీలు

- భయాందోళనల్లో ప్రజలు

గద్వాల క్రైం, ఫిబ్రవరి 29 : జోగుళాంబ గద్వాల జిల్లాలో గత కొన్ని నెలలుగా తరుచూ దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం గద్వాల పట్టణంలోని రెండవ రైల్వేగేట్‌ కాలనీలో నివసించే సునీత ఇంట్లో రూ. 14.50 లక్షలు, 10 తులాల బంగారం చోరీకి గురయ్యింది. ఇలా ఈ ఒక్క నెలలోనే చిన్న, పెద్ద దొంగతనాలు 50 వరకు జరిగినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోనే గత వారం నాలుగు దొంగతనాలు జరిగాయి. కిరాణా దుకాణాలు, తాళాలు వేసిన ఇళ్లు, సెల్‌ఫోన్ల దుకాణాల్లో చోరీలు జరిగాయి.

ఇటీవలే జరిగిన సంఘటనలు కొన్ని...

- ఈనెల 26 గద్వాల పట్టణంలోని ఐడీఎస్‌ఎంటీ కాలనీలో నివాసం ఉంటున్న విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. కొంత నగదుతో పాటు మూడు గ్రాముల బంగారం, కేజీ వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు. అదే రోజు కొత్త బస్టాండ్‌ సమీపంలోని ఒక సెల్‌ఫోన్‌ దుకాణంలో రూ.1.20 లక్షల విలువైన ఐఫోన్లు చోరీకి గురయ్యాయి.

- ఈనెల 23న గద్వాల పట్టణంలోని రెండవ రైల్వేగేట్‌లో రెండు కిరాణం దుకాణాలు, నల్లకుంటలోని ఒక కిరాణ దుకాణం, పాలకేంద్రంతో పాటు మరికొన్ని చోట్ల చోరీకి యత్నాలు జరిగాయి. మరో చోట రూ. 2.25 లక్షలు చోరీ చేశారు.

- ఈనెల 19న గద్వాల పట్టణంలోని శ్రీనివాస్‌ కాలనీలో నివసించే మిర్చి వ్యాపారి ఉప్పరి శ్రీనివాస్‌ ఇంట్లో చోరీ జరిగింది. రూ. 4.50 లక్షలతో పాటు, మూడు తులాల బంగారం చోరీ అయ్యాయి. ఇలాంటి సంఘట నలు తరుచూ జరుగుతున్నా రికవరీ మాత్రం కావడం లేదని తెలుస్తోంది.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలను అరికట్టొచ్చని పోలీసు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 547 సీసీ కెమెరాలు ఉండగా, జిల్లా కేంద్రంలోనే 153 ఉన్నాయి. నేను సైతం కార్యక్రమంలో భాగంగా ప్రతీ కాలనీలో సీసీ కెమరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సీఐ టాటా బాబు ఆధ్వర్యంలో గురువారం కాలనీల్లో పర్య టించి, సీసీ కెమెరాల వివరాలను తెలుసుకున్నారు. ఏ ప్రాంతాల్లో ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయో ఆరా తీశారు. సీసీ కెమెరాల ప్రాధాన్యంపై ప్రజలకు అవ గాహన కల్పించారు.

దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు

జిల్లా కేంద్రంలో దొంగతనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల ఏర్పాటును ముమ్మరం చేశారు. రాత్రిళ్లు గస్తీలు తిరిగేలా చర్యలు చేపట్టాం. ప్రతీ ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే, నేరాల నియంత్రణ సులభం అవుతుంది. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.

- రితిరాజ్‌, ఎస్పీ

Updated Date - Feb 29 , 2024 | 11:08 PM