Share News

ప్రజాపాలనలో ప్రగతికి పెద్దపీట

ABN , Publish Date - Jun 02 , 2024 | 10:52 PM

ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రగతికి పెద్దపీట వేస్తున్నదని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సబ్బండ వర్గాల సమష్టి కృషితో జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు ఆదివారం నాగర్‌కర్నూల్‌ పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఘనంగా జరిగాయి.

 ప్రజాపాలనలో ప్రగతికి పెద్దపీట
జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, జిల్లా ఎస్పీ

- సమష్టి కృషితో జిల్లా అభివృద్ధికి బాటలు

- తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రగతికి పెద్దపీట వేస్తున్నదని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సబ్బండ వర్గాల సమష్టి కృషితో జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు ఆదివారం నాగర్‌కర్నూల్‌ పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైన ఉందన్నారు. సమ సమాజమంతా కలిసికట్టుగా పని చేస్తూ ప్రపంచ చిత్ర పటంలో తెలంగాణ గణనీయమైన పేరు ప్రఖ్యాతులను సాధించడం ఖాయమన్నారు. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తుందన్నారు. అన్నదాతల సంక్షేమం, వ్యవసాయ పురోగాభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన సరికొత్త ప్రణాళికలు ప్రజాజీవనానికి జీవం పోస్తున్నాయని కలెక్టర్‌ చెప్పారు. ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా అభివర్ణించిన ఆయన జిల్లాలో సంపదను సమానత్వం, సామాజిక న్యాయం ద్వారా అందించడమే లక్ష్యం కావాలన్నారు. ప్రణాళికాబద్దమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల సహకారంతోనే తెలంగాణ అమరవీరుల కలలు సాకారమవుతాయన్నారు. రైతు భరోసా కింద జిల్లాలో 7.38లక్షల ఎకరాలకు 369.21 కోట్ల రూపాయల సాయం అందజేశామన్నారు. మే 6వ తేదీలోగానే 3లక్షల 8వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం రికార్డు అని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వినూత్నంగా జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాల్లో రైతులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర అధికారులతో పాటు వ్యవసాయ శాఖ నిపుణులతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం కల్పించిందన్నారు. జిల్లాలో 778 అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తద్వారా విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో శాసన సభ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారని, అందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 10:52 PM