కదిలిన యంత్రాంగం
ABN , Publish Date - Jul 19 , 2024 | 11:41 PM
కలెక్టర్లందరూ క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు.
- క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న కలెక్టర్లు
కలెక్టర్లందరూ క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని, చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. కలెక్టరేట్లలో ప్రతీ వారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు . జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారమైతే, హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గిపోతుందన్నారు. దీంతో శుక్రవారం పాలమూరు ఉమ్మడి జిల్లా యంత్రాంగం కదిలింది. కలెక్టర్లు తమ జిల్లాలోని ఒక మండలాన్ని ఎంపిక చేసుకొని పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయాలు, పీహెచ్‌సీలను ఆకస్మిక తనిఖీ చేశారు. కేజీబీవీలలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీలను శుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గుండుమల్ పీహెచ్‌సీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండటంతో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండీడ్ మండలంలోని ఎస్‌బీఐని తనిఖీ చేసిన మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి రైతులను ఇబ్బంది పెట్టొద్దని మేనేజర్‌కు సూచించారు. బిజినేపల్లి మండలంలో పర్యటించిన నాగర్‌కర్నూల్ కలెక్టర్ గురుకుల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులతో పాఠాలు చదివించారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
- బ్యాంకర్లకు సూచించిన కలెక్టర్ విజయేందిర బోయి
గండీడ్ : బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం గండీడ్ మండలంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయం, ఎస్‌బీఐ, పీహెచ్‌సీలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ధరణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, కేజీబీవీ భవన నిర్మాణ స్థలం సర్వే విషయాన్ని అడిగారు. అనంతరం ఎస్‌బీఐని తనిఖీ చేశారు. రుణ మాఫీ అయిన రైతుల జాబితాను పరిశీలించి రైతులకు మాఫీ డబ్బులు ఎలా ఇస్తున్నారని మేనేజర్ శరత్ చంద్రను అడిగి తెలుసుకున్నారు. రెన్యువల్ చేసుకున్న రైతులకు వారి ఖాతాలో జమ చేస్తామని మేనేజర్ తెలిపారు. రుణమాఫీ విషయంలో అర్హులైన రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని బ్యాంకు వారికి సూచించారు. అనంతరం పీహెచ్‌సీ తనిఖీ చేశారు. అక్కడి సౌకర్యాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. వెన్నాచేడ్‌లో నిర్వహిస్తున్న టీబీ క్యాంపులో వసతులు ఎలా ఉన్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో దేవన్న, తహసీల్దార్ నాగలక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అధికారులు తీరు మార్చుకోవాలి : నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్
కోస్గి : సిబ్బంది తీరు మారకపోతే చర్యలు తప్పవని గుండుమల్ పీహెచ్‌సీ సిబ్బందిని నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్ హెచ్చరించారు. శుక్రవా రం గుండుమల్ పీహెచ్‌సీని ఆమె తనిఖీ చేసిన సందర్భంగా ఆస్పత్రి అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచాలపై బెడ్‌సీట్లు లేకపోవడమేంటని డాక్టర్ కిష్టమ్మను ప్రశ్నించారు. ఇక్కడ బెడ్‌సీట్లు ఎత్తుకెళ్తున్నారని సమాధానమివ్వడంతో మీరేం చేస్తున్నారని మండిపడ్డారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం బోగారం జడ్పీ హెచ్‌ఎస్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. ఎలా చదువుకుంటున్నారు. పాఠాలు అర్థమౌతున్నాయా అని అడిగారు. ఏదైనా అర్థం కాకుం టే ఉపాధ్యాయులను అడిగి నేర్చుకోవాలన్నారు. అనంతరం పాఠశాల, పీహెచ్‌సీ ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత కోస్గి ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాల యాలను తనిఖీ చేశారు. ధరణి పెండింగ్ ధరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలన్నారు. భూ సమస్యలగురించి రైతులు కార్యాలయం చుట్టూ తిరగవద్దన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమం లో ఎంపీడీవో విజయలక్ష్మి, తదితరులున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
-కలెక్టర్ బదావత్ సంతోష్
బిజినేపల్లి: గురుకులాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మండలం లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల భవన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూ చించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులతో మాట్లాడుతూ ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. గురుకులానికి సొంత వసతి గృహం లేకపోవడమే ప్రధాన సమస్యగా ఉందని ప్రిన్సిపాల్ సుమతి కలెక్టర్ దృష్టి తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఫిట్స్ వచ్చి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న విద్యార్థి వద్దకువెళ్లి మెరుగైన వైద్యం అందిం చేందుకు జిల్లా ఆస్పత్రికి తరలించాలని అధికారులకు సూచించారు. విద్యార్థి తక్షణ ఖర్చుల కోసం కొంత నగదు అందించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీరాములు, ఎంపీడీవో కతలప్ప, వైద్యాధికారి డాక్టర్ శివ కుమార్ ఉన్నారు.
దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి
- రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్ : దోమలు వ్యాప్తి చెందకుండా పారిశుఽధ్య చర్యలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. శుక్రవారం సాయంత్రం ఆర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులను పరిశీలించి, విద్యార్ధులతో పాఠా లు చదివించారు. చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. తెలుగుతో పాటు ఆంగ్ల బాషలో కూడా విద్యార్ధులకు మంచి ప్రావీణ్యం కల్పించాలని ఆదేశించారు. పాఠశాలలో 123 మంది విద్యార్ధులు రెసిడెన్సియల్ పాఠశాలలో చదువుకుంటున్నారని వార్డెన్ కలెక్టర్‌కు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పారిశుధ్య నిర్వహణ పక్కాగా నిర్వహించి దోమలు వ్యాప్తి చెంద కుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇందిర, ఎంఈవో సురేష్, జిల్లా కోఆర్డినేటర్ ఈస్టర్ రాణి, వార్డెన్ ఉన్నారు.