చికెన్ వ్యర్థాల సేకరణకు రూ.14.20 లక్షలు
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:08 PM
పాలమూరు పురపాలిక పరిధిలో చికెన్ వ్యర్థాల సేకరణకు నిర్వహించిన వేలం పాటలో జన్ను విజయ్‌కుమార్ అత్యధికంగా రూ.14.20 లక్షల వేలం పాడి టెండర్ దక్కించుకున్నారు.

- 3 నెలల కాలానికి టెండర్ నిర్వహణ
- అత్యధిక వేలం పాడి దక్కించుకున్న జన్ను విజయ్‌కుమార్
మహబూబ్‌నగర్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు పురపాలిక పరిధిలో చికెన్ వ్యర్థాల సేకరణకు నిర్వహించిన వేలం పాటలో జన్ను విజయ్‌కుమార్ అత్యధికంగా రూ.14.20 లక్షల వేలం పాడి టెండర్ దక్కించుకున్నారు. ఇందుకోసం ఆరుగురు సభ్యులు వేలంలో పాల్గొనగా, శనివారం పురపాలిక సమావేశ మందిరంలో కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి బహిరంగ వేలం పాట నిర్వహించారు. టెండరు దక్కించుకున్న వారు జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అంటే మూడు నెలల పాటు చికెన్, మటన్, ఫిష్ వ్యర్థాలను సేకరించాల్సి ఉంటుంది. ఇది వరకు గుట్టుచప్పుడు కాకుండా ఏడాది కాలానికి నిర్వహించిన టెండర్‌లో ఇద్దరు మాత్రమే పాల్గొనగా గయాజుద్దీన్ అనే వ్యక్తి ఏడాది కాలానికి రూ.15 లక్షలకు టెండరు పాడి దక్కించుకున్నారు. అయితే పెద్ద వివాదాలకు దారి తీసింది. పలువురు వ్యాపారులు వారికి వ్యర్థాలు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్‌కు వ్యాపారుల మధ్య గొడవలు జరగడం వీరి వివాదం తరుచూ ఎమ్మెల్యే, అధికారుల వద్దకు చేరడంతో ఎట్టకేలకు గయాజుద్దీన్ కాంట్రాక్టర్‌ను రద్దుచేసి మళ్లీ టెండర్‌ను నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఇది వరకు ఏడాదికి రూ.15 లక్షలు టెండరు పాడితే ఇప్పుడు మూడు నెలల కాలానికే రూ.14.20 లక్షలు పాడి దక్కించుకున్నారంటే చికెన్ వ్యర్థాల సేకరణకు ఉన్న డిమాండ్ ఏ పాటిదో ఇట్టే అర్థమవుతోంది.