Share News

Telangana : మధు కుమార్తె దక్కలేదనే..!

ABN , Publish Date - May 29 , 2024 | 05:06 AM

క్యాసినోకింగ్‌, బిల్డర్‌ మణికంఠ మధు (49) హత్య అత్యంత పథకం ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. పాత కక్షలతోనే మధును బీదర్‌కు తీసుకెళ్లి చంపినట్లు సమాచారం.

Telangana : మధు కుమార్తె దక్కలేదనే..!

కక్షకట్టి స్నేహితులతో కత్తులు,

బీరు బాటిళ్లతో పొడిచి మధు హత్య

మధు కోట్లకు పడగెత్తడంతో

పేకాట స్నేహితుడైన రేణుకా ప్రసాద్‌ కన్ను

కుమార్తెను తనకిచ్చి పెళ్లి చేయాలని

ప్రతిపాదన.. తిరస్కరించడంతోనే ఘాతుకం

జీడిమెట్ల, మే 28(ఆంధ్రజ్యోతి): క్యాసినోకింగ్‌, బిల్డర్‌ మణికంఠ మధు (49) హత్య అత్యంత పథకం ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. పాత కక్షలతోనే మధును బీదర్‌కు తీసుకెళ్లి చంపినట్లు సమాచారం. అనతికాలంలోనే మధు కోట్లకు పడగలెత్తడంతో ఆయన చిన్న కుమార్తెను పేకాటలో స్నేహితుడైన రేణుకా ప్రసాద్‌ (28) ప్రేమలోకి దింపినట్లు.. ప్రేమ విషయాన్ని మధుకు రేణుకా ప్రసాద్‌ చెప్పడంతో ఆయన తిరస్కరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కుమార్తెకు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడంతో రేణుకా ప్రసాద్‌ ఆయనపై కక్ష పెంచుకున్నట్లు.. పథకం ప్రకారం ఉమ్మడి స్నేహితులతో కలిసి బీదర్‌కు తీసుకెళ్లి హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మధు హత్య ఘటనతో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ హత్యపై జీడిమెట్ల పోలీసులు మౌనం వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కుత్బుల్లాపూర్‌ చింతల్‌ ప్రాంతంలో అందరికి సుపరిచితుడైన మణికంఠ మధు అంచెలంచెలుగా ఎదిగి కోట్లు సంపాదించాడు. క్యాసినోలో పరిచయమైన కల్పనా సొసైటీకి చెందిన రేణుకాప్రసాద్‌, వాజ్‌పేయ్‌నగర్‌కు చెందిన లిఖిత్‌ సిద్దార్ధరెడ్డి, గోపి, వరుణ్‌లతో తరచూ ఆయన బీదర్‌కు వెళ్లివస్తుంటాడు. మధు చిన్న కుమార్తెను ప్రేమిస్తున్నాంటూ, తనకే ఇచ్చి పెళ్లి చేయాలంటూ రేణుకా ప్రసాద్‌ చేసిన ప్రతిపాదనను మధు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని గొడవలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. మధుపై కక్ష పెంచుకున్న రేణుకా ప్రసాద్‌.. ఆయనతో మామూలుగా ఉంటూనే హత్య చేసేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు.


శుక్రవారం క్యాసినో కోసం బీదర్‌కు వెళ్దామని మధుకు ప్రతిపాదన రేణుకా ప్రసాద్‌ పెట్టాడు. లిఖిత్‌ సిద్దార్థ రెడ్డి, గోపి, వరుణ్‌, మరో ఇద్దరు రాకీ, తీర్థను కూడా వెంటబెట్టుకొని మధుతో కలిసి రేణుకా ప్రసాద్‌ బీదర్‌ వెళ్లాడు. క్యాసినోలో పాల్గొన్న తర్వాత బీదర్‌ నుంచి తిరిగొచ్చే సమయంలో రేణుకా ప్రసాద్‌ సహా ఐదుగురు స్నేహితులు కలిసి మధును కత్తులు, బీరుబాటిళ్లతో పొడిచి హత్య చేశారు. కర్ణాటక పరిధిలో హత్య చేస్తే సులభంగా కేసు నుంచి బయటపడొచ్చనే ఆలోచించే బీదర్‌లో హత్యచేసినట్లు తెలుస్తోంది. కాగా మధును హత్య చేసిన దుండగులు, తమకూ హాని తలపెడతారేమోనని ఆయన కుటుంబీకులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మంగళవారం మధు కుటుంబసభ్యులు జీడిమెట్ల పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వబోయినా కేసును కర్ణాటక పోలీసులు చూస్తున్నారని, తమకేమీ సంబంధం లేదని చెబుతూ ఫిర్యాదు కూడా తీసుకోలేదని తెలుస్తుంది. కనీసం ఈ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిర్లక్ష్య థోరణితో వ్యవహరించడంపై స్థానికంగా ఆగ్రహం వక్తం చేస్తున్నారు.

Updated Date - May 29 , 2024 | 05:06 AM