Share News

చంపేస్తున్నారు

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:00 AM

భద్రాద్రి జిల్లా చర్ల మండల కేంద్రంగా పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ అక్రమ దందా గురించి పట్టించునేవారు లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పశువుల రవాణా కొనసాగుతోంది. ప్రతీరోజు ఛత్తీస్‌గఢ్‌ నుంచి పశువులను సేకరించి డీసీఎంలు, కంటైనైర్లు, ట్రాలీ ఆటోల్లో కుక్కి వాటిని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాం

చంపేస్తున్నారు

చర్ల కేంద్రంగా జోరుగా పశువుల అక్రమ రవాణా

ప్రతీరోజు భారీ వాహనాల్లో కబేళాలకు తరలింపు

రాష్ట్రంలోనే అతిపెద్ద చీకటి వ్యాపారం

మండలంలోనే తిష్ట వేసిన 30మంది వ్యాపారులు

పట్టించుకోని అధికారులు

చర్ల, జనవరి 2: భద్రాద్రి జిల్లా చర్ల మండల కేంద్రంగా పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ అక్రమ దందా గురించి పట్టించునేవారు లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పశువుల రవాణా కొనసాగుతోంది. ప్రతీరోజు ఛత్తీస్‌గఢ్‌ నుంచి పశువులను సేకరించి డీసీఎంలు, కంటైనైర్లు, ట్రాలీ ఆటోల్లో కుక్కి వాటిని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వాటిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. పశువుల కాళ్లు, శరీర భాగాలు విడిపోయి మూగజీవాలు అల్లాడి పోతున్నాయి. పశువులను చంపి అనేకమంది వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు. ఈ వ్యాపారం లాభసాటిగా ఉండడంతో కొందరు ఏకంగా ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు పశువుల అక్రమ వ్యాపారంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అక్రమ రవాణా ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చూడడానికి కూడా పశువులు కనిపించని పరిస్థితి ఏర్పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతీరోజు భారీ వాహనాల్లో

చర్ల, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో పశుసంపద అధికంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది పశువులు అక్రమ వ్యాపారంపై కన్నెశారు. స్థానికంగా ఉండే వారిని ఏర్పాటు చేసుకుని చర్ల, ఛత్తీస్‌గఢ్‌ గ్రామాల్లో ఉన్న పశువులను కొనుగోలు చేస్తున్నారు. అనంతరం వాటిని వందల కిలోమీటర్లు నడిపించి చర్ల మండల కేంద్రంలోని లెలిన్‌కాలనీ, లక్ష్మీకాలనీ, తాలిపేరు ప్రాజెక్టు ప్రాంతాలకు తీసుకొచ్చి ఆవులు, ఎడ్లు, గేదెలను ప్రత్యేకంగా కంటైన్లు, డీసీఎం వాహనాల్లో ఎక్కిస్తున్నారు. సుమారు 6 పశువులు పట్టే వాహనంలో 20 నుంచి 30 పశువులను కుక్కుతున్నారు. పశువులు ఎక్కలేక పోతేవాటిని చిత్రహింసలు పెట్టి వేధిస్తున్నారు. కనీసం వాటికి ఆహరం కూడా అందించడం లేదు. అనంతరం వాటిని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. ఒకవేళ మార్గం మధ్యంలో పశువులు చనిపోతే వాటిని అక్కడే పడేస్తున్నారు. ఇలా గత కొంత కాలంగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. గతంలో రాత్రి వేళల్లోనే సాగే ఈ అక్రమ పశువుల వ్యాపారం నేడు పగలు కూడా నడుస్తోంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాల్లో పట్టపగలే ఎక్కించి తరలిస్తున్నారు. గత పది రోజుల్లో చర్ల నుంచి సుమారు 50 నుంచి 60 లారీలు పశువులను హైదరాబాద్‌ తరలించారు. అలా తరలించిన వాటిలో ఆవులు, గేదెలు, ఎడ్లు, దూడలు ఉన్నట్లు స్థానికులు భహిరంగంగానే చెబుతున్నారు.

సేకరించేది ఒకరు.. తరలించేది మరొకరు

చర్ల మండలంలో సాగుతున్న పశువులు వ్యాపారంలో సుమారు 30 మంది వ్యాపారులు దందా చేస్తున్నారు. వీరిలో నలుగురు వ్యక్తులు పశువులను తెలిప్పించి చర్ల మండలంలో వాటిని నిల్వచేస్తున్నారు. సాయంత్రం, పగలు సమయాల్లో వాటిని లారీల్లో ఎక్కించి పట్టణాలను తరలిస్తున్నారు. వాహనాల్లో తరలించే ముందు ఎస్కార్ట్‌ వాహనాల్లో రక్షణగా ఉండి పశువులను తరలిస్తున్న సమాచారం. ఎక్కడైనా తనిఖీలు జరుగుతన్నాయని తెలిస్తే పశువులను తరలించే వాహనాలను దారి మళ్లించి మరో మార్గంలో వాటిని తరలిస్తున్నారు.

పట్టుబడుతున్నా ఆగని దందా

పశువులను కబేళాలకు తరలించడం చట్టరిత్యానేరం, అయినా చర్ల మండలంలోని వ్యాపారులు పశువుల అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. స్థానిక యువకులు ఎవరైనా వాహనాలను ఆపితే ముందుగా వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. అయినా వారు వినకపోతే భారీగా డబ్బులు ముట్టజెబుతున్నారు. ఈ పశువులు అక్రమ వ్యాపారంలో మహిళలు కూడా పాల్గొంటుండడం గమనార్హం.

చర్లనుంచే అత్యధికంగా..

చర్ల మండలంలో సాగే పశువుల అక్రమ వ్యాపారం రాష్ట్రంలోనే అది పెద్దదిగా తెలుస్తోంది. ఈ మండలం నుంచి తరలిస్తున్న వాహనాలను ములుగు, ఖమ్మం, భద్రాద్రి, హైదరాబాద్‌ జిల్లాల్లో పట్టుబడుతున్నాయి. చర్ల కేంద్రం నుంచి ఇప్పటి వరకు సుమారు లక్షకు పైగా పశువులు కబేళాలకు తరలినట్లు తెలుస్తోంది. ఈ దందా చేసి చర్లలో ఐదుగురు వ్యాపారులు రూ.కోట్లు సంపాదించారని తెలుస్తోంది. చర్ల మండల కేంద్రంలోనే ఈ పశువుల వ్యాపారం స్వేచ్ఛగా సాగుతున్నా చర్ల పోలీసులుగానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా చర్ల నూతన సీఐ బి. రాజగోపాల్‌ ఈ పశువుల అక్రమ వ్యాపారంపై దృష్టి సారించాలని, పశువుల గోసను తీర్చాలని మండలవాసులు కోరుతున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:00 AM