యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
ABN , Publish Date - Feb 10 , 2024 | 11:52 PM
సత్తుపల్లి మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా ఆగడం లేదు. మట్టి అక్రమ తవ్వకాలు జరగడం, ప్రతిరోజూ లక్షలాది రూపాయల విలువైన మట్టి రవాణా జరుగుతున్నా అధికారులు తమకు ఫిర్యాదు అందలేదంటూ తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు
ఫిర్యాదు లేదంటూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న అధికారులు
రాజకీయ నాయకులను ఆశ్రయించిన మట్టి వ్యాపారులు
సత్తుపల్లి, ఫిబ్రవరి 10: సత్తుపల్లి మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా ఆగడం లేదు. మట్టి అక్రమ తవ్వకాలు జరగడం, ప్రతిరోజూ లక్షలాది రూపాయల విలువైన మట్టి రవాణా జరుగుతున్నా అధికారులు తమకు ఫిర్యాదు అందలేదంటూ తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గత కొద్ది నెలలుగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు మట్టి వ్యాపారులు అధికారులను, రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుని తమకు ఎదురే లేదన్న ధోరణిలో తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలపై పత్రికలలో కథనాలు వెలువడుతున్నా ఏ స్థాయిలోనూ పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని కొందరు వ్యాపారులు తమను ఎవరూ నియంత్రించలేరన్న ధీమాను ప్రదర్శిస్తున్నారు. అక్రమ వ్యాపారం ఏ రకమైన అడ్డంకులు లేకుండా సాగడం వెనుక భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు సత్తుపల్లిలో ప్రచారం జరుగుతుంది.
రాజకీయ నాయకుల అభయహస్తం
పత్రికలలో అక్రమ మట్టి వ్యాపారంపై కథనాలు వెలువడుతుండటంతో మట్టి వ్యాపారులు రాజకీయ నాయకులను ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో వ్యాపారులకు కొందరు రాజకీయ నాయకులు అభయహస్తం ఇచ్చి అండ గా ఉంటామని, వ్యాపారాన్ని కొనసాగించమని భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మట్టి రవాణా సందర్భంగా ఆర్థికంగా పలు స్థాయిల్లో సెటిల్‌మెంట్ చేసేందుకు రవాణా చేసే వాహనాల స్థాయిని బట్టి ఒక్కో వాహనానికి గరిష్ఠంగా ట్రిప్ రూ.150వరకు సిండికేట్ వ్యాపారులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. దీనిని బట్టి ఆర్ధిక లావాదేవీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో స్పష్టం అవుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు. శుక్రవారం కూడా కొత్తూరు, కొమ్మేపల్లి గ్రామాల పరిసరాలల్లో భారీస్థాయిలో తవ్వకాలు జరిపి టిప్పర్లు, ట్రాక్టర్లతో రవాణా జరిగింది.
నియంత్రణ లేని అతివేగం
మట్టి రవాణా చేసే ట్రాక్టర్లు, టిప్పర్ల వేగానికి ఇతర వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. పెద్ద సంఖ్య లో ట్రిప్పులు వేయాలనే లక్ష్యంతో వాహనాలను అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేర్చి అక్కడి నుంచి తిరిగి క్వారీకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతాయనే ఆరోపణలు, ఆందోళన వ్యక్తమవుతుంది. మట్టి రవాణా చేసే పలు ట్రాక్టర్లకు కనీసం సరైన డాక్యూమెంట్స్ కూడా లేవనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా వాహనాలకు సంబందించిన ఇన్సూరెన్స్ పత్రాలు కూడా లేకపోవడంతో ప్రమాద సమయంలో భారీనష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఫిట్‌నెస్ లేని వాహనాలను కూడా మట్టి రవాణాకు వినియోగిస్తున్నారని పలువురు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఇటు అధికారులు, అటు రాజకీయ నాయకుల అండదండల నేపధ్యంలో అక్రమ మట్టి వ్యాపారం భారీ స్థాయిలో కొనసాగుతోంది.