మా భర్తలతో వెట్టి చాకరి చేయిస్తున్నారు
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:23 AM
పోలీసుల పేరుతో బెటాలియన్‌లో కూలీలుగా మార్చి వెట్టిచాకరి చేయిస్తున్నారని వారి భార్యలతోపాటు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- రాస్తారోకో చేసిన బెటాలియన్ పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబసభ్యులుసిరిసిల్ల రూరల్, అక్టోబరు 24 (అంధ్రజ్యోతి): పోలీసుల పేరుతో బెటాలియన్‌లో కూలీలుగా మార్చి వెట్టిచాకరి చేయిస్తున్నారని వారి భార్యలతోపాటు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం సిరిసిల్ల 17వ పోలీస్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబీకులు ప్లకార్డులతో భర్తల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి న్యాయం చేయాలంటూ నిరసన తెలిపేందుకు వచ్చారు. అక్కడే మోహరించిన సిరిసిల్ల పోలీసులు అడ్డుకుని ప్లకార్డులను తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన వారందరూ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగానికి తమ భర్తలు చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోయిందన్నారు. పోలీస్ ఉద్యోగం పేరుతో బెటాలియన్‌లో కూలీ పనులు చేస్తున్నారని ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పుకోవడానికి నామూషిగా ఉందన్నారు. తమ భర్తలకు ఎనలేని డ్యూటీలు వేసి కుటుంబంతో గడపకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయ పాలన లేకుండా డ్యూటీలను పోలీస్ అధికారులు వేయడం వలన తమ భర్తలు డ్యూటీ చేయాలంటే భయంతో వణికిపోతున్నారన్నారు. శుభకార్యాలు జరుపుకోవడానికి సెలవులను ఇవ్వకుండా అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని.. ఒకవేళ సెలవు తీసుకోవాలంటూ అధికారులకు లంచాలను ఇవ్వాల్సిందేనని అన్నారు. బెటాలియన్‌లో పనిచేసే వారు చనిపోతే కానిస్టేబుళ్లు అంత్యక్రియలు చేయాలని వాళ్లే డప్పుళ్లు కొట్టాల్సిన దుస్ధితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమలుచేస్తున్న పోలీస్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి తమ భర్తలకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, రూరల్ సీఐ మొగిలి అక్కడికి చేరుకోని వారితో మాట్లాడి ఆందోళనలు చేయవద్దని చెప్పినా ఎవరు వినిపించుకోకపోవడంతో వారిని పోలీసులు బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించి సర్ధాపూర్‌లోని 17వ పోలీస్ బెటాలియన్‌కు తరలించారు. అక్కడి బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావుతో సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని బెటాలియన్‌లలో అమలు చేస్తున్న వాటిని ఇక్కడ కూడా అమలు చేసి విధులను అప్పగించడం జరుగుతుందని అన్నారు. దీనిపై పైఅధికారులకు నివేదికలను అందిస్తామని తెలిపారు.