Share News

వీర్నపల్లిలో గాలివాన బీభత్సం

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:30 AM

అకాల వర్షాలు రైతన్నకు శాపంగా మారాయి. వీర్నపల్లి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన గాలివానకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది.

వీర్నపల్లిలో గాలివాన బీభత్సం
బాబాయ్‌ చెరువు తండాలో తడిసిన ధాన్యం

వీర్నపల్లి, ఏప్రిల్‌ 19: అకాల వర్షాలు రైతన్నకు శాపంగా మారాయి. వీర్నపల్లి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన గాలివానకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. కవర్లు కప్పి రక్షించే ప్రయత్నం చేసినా వేగంగా వీచిన గాలులకు కవర్లు కొట్టుకుపోయాయి. ధాన్యం రాశులు, బస్తాలు వరద నీటికి తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. భారీ వర్షంతో కల్లాల్లో ఉన్న ధాన్యం నీటిపాలై అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సకాలంలో స్పందించక పోవడంతోనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వరి కోతలు పూర్తయి పదిహేను రోజులు కావస్తున్న కొనుగోళ్లు చేపట్టకపోవడంతో పెద్ద మొత్తంలో ధాన్యం కల్లాల్లో మగ్గుతోంది.

తడిసి ముద్దయిన ధాన్యం

వీర్నపల్లి మండలంలో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి 17 గ్రామాల్లో సుమారు 10 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయ్యింది. లాల్‌ సింగ్‌ తండాలో ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. గడ్డివాము ప్రధాన రహదారిపై వచ్చి చేరడంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న రెవెన్యూ శాఖ అధికారులకు ఆటంకం ఏర్పడింది. వెంటనే రెవెన్యూ సిబ్బంది గడ్డిని పూర్తిగా తొలగించారు. వీర్నపల్లి మండలకేంద్రంలో రైతు పిట్ల ముత్యంకు చెందిన మామిడి తోటలో మామిడికాయలు నేలరాలాయి. అకాల వర్షానికి సుమారు రూ.50 వేల పంట నష్టం వాటిల్లినట్లు రైతు పేర్కొన్నాడు.

దిగుబడి వచ్చినా చేతికిరాని పంట

అష్టకష్టాలు పడి కోతలు పూర్తిచేసి ధాన్యాన్ని కల్లాల్లోకి తరలిస్తే కొను గోలు చేసేవారు లేక పంట నీటిపాలైంది. కల్లాల్లో ఉన్న ధాన్యం బస్తాలు పూర్తిగా నీటిలో మునిగి పోయాయి. ఆరబోసిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులకు కోలుకోని విధంగా నష్టం వాటిల్లింది. కొను గోలు కేంద్రాల్లో వసతులు కల్పించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారలు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండి పడుతున్నారు.

రుద్రంగి: రుద్రంగి మండల కేంద్రంలో మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం కురిసింది. దీంతో మార్కెట్‌ యార్డులో, సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ధాన్యం మ్యాచర్‌ వచ్చినా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచర్‌కు వచ్చిన ధాన్యం అకాల వర్షం కారణంగా తడిసి ముద్ద కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కోనరావుపేట : కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లితోపాటు పలు గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. నిమ్మపల్లిలో నర్సయ్య లక్ష్మికి చెందిన ఇంటి రేకులు కొట్టుకపోవడంతో భయాందోళన గురయ్యారు. ఇంట్లోని సామగ్రి తడిసి ముద్దయ్యింది. పలు గ్రామాల్లోని కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. రేకులు కొట్టుకుపోయి నిరాశ్రయులైన నర్సయ్య లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా నాయకురాలు విమల కోరారు.

ముస్తాబాద్‌ : మండల కేంద్రంతోపాటు, కొండాపూర్‌, రాంరెడ్డిపల్లె, ఆవునూర్‌, గూడెం, నామాపూర్‌ చిప్పలపెల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం తేలికపాటి వర్షం పడింది. గాలిదుమారం లేవడంతో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని కొంతమంది కుప్ప చేశారు. సెంటర్లలో ఆరబోసిన ఽధాన్యం పాక్షికంగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరారు. గాలిదుమారంతో చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడి కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి.

Updated Date - Apr 20 , 2024 | 12:30 AM