Share News

ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ను గెలిపించండి

ABN , Publish Date - May 08 , 2024 | 12:15 AM

ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. మంగళవారం నిర్వహించాల్సిన కరీంనగర్‌ జనజాతర సభ వర్షం కారణంగా రద్దయింది. అనంతరం అదే సభావేదికపై మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ను గెలిపించండి

కరీంనగర్‌ అర్బన్‌, మే 7: ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. మంగళవారం నిర్వహించాల్సిన కరీంనగర్‌ జనజాతర సభ వర్షం కారణంగా రద్దయింది. అనంతరం అదే సభావేదికపై మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సభ వర్షం కారణంగా రద్దయింనా ప్రకృతి తమను ఆశీర్వదించిందన్నారు. సభకంటే ప్రజలకు ఎండవేడి నుంచి ఉపశమనం ముఖ్యమని అన్నారు. ఈ రోజు కురిసిన గాలివానలాగే కాంగ్రెస్‌కు ఓట్ల వాన కురుస్తుందన్నారు. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలు మినహా అన్ని మండలాల్లో కార్నర్‌ మీటింగ్‌లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ఉత్తరభారతదేశంలో మొదటి, రెండో దశలో బీజేపీకి వ్యతిరేక ఓటింగ్‌ వచ్చిన కారణంగానే మోదీ దిగజారుడు వాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో క్యంగా ఉందని, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ వెంట ఆ పార్టీ సీనియర్‌ నాయకులు ఎందుకు లేరని మంత్రి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్థానికేతరుడని, అతని గ్రాఫ్‌ పడిపోయిందన్నారు. అవినీతి కారణంగానే బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్ష పదవి పోయిందని, దీనిపై సమాధానం చెప్పాలన్నారు. రాముడి కల్యాణానికి ముందు అక్షింతలు ఎలా వస్తాయని ప్రశ్నించాడు. అక్షింతలు కాదు అవి రేషన్‌ బియ్యమని కేటీర్‌ అన్నాడని, తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒకటేనని, ఢిల్లీలో తోస్తీ, గల్లీలో కుస్తీ చేస్తుంటాయని విమర్శించారు. కరీంనగర్‌ను కోహినూర్‌ వజ్రంలా అభివృద్ధి చేస్తానంటూ, విజన్‌తో వస్తున్న వెలిచాల రాజేందర్‌రావును ప్రజలు గెలిపించాలని కోరారు.

బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు

- కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే అవకాశముందన్నారు. తన తండ్రి చివరి కోరిక మేరకు తాను ప్రజలమద్య ఉండాలనుకుని ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ఎటువంటి అవినీతి మచ్చలేని తనను ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌ను కోహినూర్‌గా చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్‌, కోడూరు సత్యనారాయణగౌడ్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అకారాపు భాస్కర్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, కర్ర సత్యప్రన్నరెడ్డి, మునగింటి అనిల్‌, పోతారపు సురేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 12:15 AM