Share News

ఓటు బదిలీ జరిగేనా?

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:11 AM

కాంగ్రెస్‌ సర్కారు రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి నాయకులు క్యూ కట్టారు.

  ఓటు బదిలీ జరిగేనా?

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కాంగ్రెస్‌ సర్కారు రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి నాయకులు క్యూ కట్టారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ పార్టీని వీడిన వారు సైతం మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. తిరిగి వచ్చిన నేతలు, పార్టీ మారిన వలస నేతలు అంతా తమదే పెత్తనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీ బాట పట్టిన వారూ ఉన్నారు. సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో వలస వచ్చిన నేతలతో లోక్‌సభ ఎన్నికల్లో ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందనే చర్చ పార్టీలో మొదలైంది.

వలస నేతలతో ఓటర్లు మారేనా?

సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో వలస రాజకీయాలు జోరుగా సాగుతున్నా ఓటర్ల తీరు మాత్రం అంతు చిక్కడం లేదు. తమ మారినంత మాత్రానా ఓటర్లు మారుతారా అనే సందిగ్ధం నెలకొంది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌ను వీడుతున్న నాయకులు కాంగ్రెస్‌, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. పార్టీలు మారుతున్న నాయకుల వెంట పదుల సంఖ్యలో కూడా అనుచరులు ఉండకపోవడం గమనార్హం. సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో 4.72 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో సిరిసిల్ల సెగ్మెంట్‌లో 2,46,,212 మంది, వేములవాడ 2,25,904 మంది ఉన్నారు. 2023 శాసన సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఒకటి, కాంగ్రెస్‌ మరొకటి గెలుచుకుంది. చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి, మానకొండూర్‌ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే గెలుపొందారు. సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్‌లలో సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌కు 89,244 ఓట్లు, కాంగ్రెస్‌కు 59,557, బీజేపీకి 18,328 ఓట్లు లభించాయి. వేములవాడ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌కు 71,451, బీఆర్‌ఎస్‌కు 56,870 ఓట్లు, బీజేపీకి 29,710 ఓట్లు లభించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు 70,482 ఓట్లు, బీజేపీకి 64,769, కాంగ్రెస్‌కు 18,733 ఓట్లు, వేములవాడ సెగ్మెంట్‌లో బీజేపీకి 73,290 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 47,399, కాంగ్రెస్‌కు 15,606 ఓట్లు లభించాయి. ప్రస్తుతం వలసల నేపథ్యంలో ఓటర్లు ఏ మేరకు మారుతారు? ఏ పార్టీకి లాభం చేకూరుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.

ఆగని వలసలు

సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. లోక్‌సభ ప్రచారం ఊపందుకునే సమయంలో వలసలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తరువాత వరుసగా సర్పంచ్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు ఉండడంతోనే తమ రాజకీయ భవిష్యత్‌ కోసం అధికార పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా చేరుతున్న నేతలతో పార్లమెంట్‌ అభ్యర్థులకు ఎంతవరకు కలిసి వస్తుందనే మాట ఎలా ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వలస నేతలతో ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న వారు తమ ప్రాధాన్యం తగ్గిపోతోందని ఆందోళన చెందుతున్నారు. పార్టీలు మారి వచ్చిన వారు మళ్లీ పెత్తనం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీలో విభేదాలు కొని తెచ్చినట్లుగా భావిస్తున్నారు. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడం, నామినేషన్లు వేయడం పూర్తయ్యింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోవడంతో వలస నేతల్లో మరింత సందడి పెరగనుంది. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లో వలసలు మరింత ఊపందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Updated Date - Apr 26 , 2024 | 12:11 AM