ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేదెన్నడో?
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:19 AM
ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నీడ కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ అమలు కోసం ప్రజలు పది నెలలుగా ఎదురుచూస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నీడ కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ అమలు కోసం ప్రజలు పది నెలలుగా ఎదురుచూస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూం ఇళ్లపై పెట్టుకున్న ఆశలు నీరుకారిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీగా ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లు ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి. నియోజకవర్గానికి 2,500 చొప్పున మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామాల్లో, వార్డుల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల మంజూరు ప్రక్రియకు కదలిక రావడంతో త్వరలోనే తమకు ఇ ందిరమ్మ ఇళ్లు అందుబాటులోకి రానున్నాయని దరఖాస్తుదారులను కమిటీ ఏర్పాటు అంశం వివాదాస్పదం కావడం కలవరపరుస్తున్నది. గ్రామ సభలు ఏర్పాటు చేయకుండా కమిటీల ఏర్పాటును చేపట్టడం అప్రజాస్వామికమని బీజేపీనేత కోర్టుకు వెళ్లాడు. కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా కమిటీల ఏర్పాటు వివాదాస్పదంగా మారి జిల్లా ఇన్‌చార్జి మంత్రికి రెండేసి జాబితాలు అందాయి. విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తాము ప్రతిపాదించిన కమిటీలకే ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని వివాదాల మధ్య ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేనా అంటూ ఇళ్లను ఆశిస్తున్నవారు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇళ్ల మంజూరు బ్రేక్ పడుతుంది.
డిసెంబరులో దరఖాస్తుల స్వీకరణ
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం గత డిసెంబరు 28 నుంచి ఈ సంవత్సరం జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా 2.17 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ప్రతి వారం జరిగే ప్రజావాణిలో వందలాది మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో ఇటీవల కదలిక వచ్చింది. కొత్తగా దరఖాస్తు చేసుకోవలనుకునేవారు ప్రజాపాలన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని చూస్తే అది తెరుచుకోవడం లేదు. దీంతో నిరాశచెందిన ప్రజలు ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ఒక్క ఇంటికి 217 దరఖాస్తులు
ఇళ్లను ఆశిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటే ప్రభుత్వం నియోజకవర్గానికి కేవలం 2,500 ఇళ్ళను మంజూరీ చేస్తామని ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాలో పది వేల ఇళ్లు మంజూరు కానున్నాయి. జిల్లావ్యాప్తంగా స్వీకరించిన దరఖాస్తులనే పరిగణలోకి తీసుకున్నా ఒక్కో ఇంటికి 217 మంది పోటీ పడుతున్నట్లు అవుతున్నది. ప్రజావాణి దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలనే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సొంత ఇంటి స్థలాలు ఉన్నవారికి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్న హామీని అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ కాలేదని అధికారులు చెబుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని, సొంతగా స్థలాలు ఉన్నవారికి ఇళ్ళు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, ఎస్సీ, ఎస్టీలకు 10 లక్షల చొప్పున ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు కమిటీల ఏర్పాటుపై రాజుకుంటున్న వివాదం ఎప్పుడు కొలిక్కి వస్తుందో... స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఇళ్ల మంజూరవుతాయో లేదోనని ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.