Share News

ఎస్సారెస్పీ ఉప కాల్వలలో పిచ్చి మొక్కలు....

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:32 PM

మండలంలోని ఎస్సారెస్పీ ఉపకాల్వలు పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందుతుందో లేదోనని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎస్సారెస్పీ ఉప కాల్వలలో పిచ్చి మొక్కలు....

మానకొండూర్‌, డిసెంబరు 31: మండలంలోని ఎస్సారెస్పీ ఉపకాల్వలు పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందుతుందో లేదోనని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ నుంచి కాకతీయ కాల్వ ద్వారా మండలంలోని సదాశివపల్లిలోని డీబిఎం 2 ఉపకాల్వ నుంచి కొండపల్కల డీబిఎం 7 ఉపకాల్వ ద్వారా మండలంలోని అన్ని గ్రామాలకు సాగు నీరు సరఫరా అవుతోంది. డీబీఎం 6 ఉపకాల్వ ద్వారా దేవంపల్లి నుంచి జమ్మికుంట మండలంలోని వివిద గ్రామాలకు సాగునీరు సరఫరా అవుతుంది. ఎస్సారెస్పీ ఉపకాల్వలు పిచ్చి మొక్కలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. వానాకాలం సీజన్‌లో చివరి ఆయకట్టుకు సాగునీరు అందలేదు. దిగువ జలాశయం నుంచి కాకతీయ కాల్వకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం నీటిని విడుదల చేశారు. యాసంగి పంటకు మండల రైతులు సాగు చేసినప్పటికి చెరువులు, కుంటలను నింపేందుకు గాను వారాబందీ కింద నీటి సరఫరా చేస్తున్నారు. మార్చి 31 వరకు వారాబందీ కింద ఆయకట్టు రైతులకు దిగువ జలాశయం నుంచి ఎస్సారెస్పీ అధికారులు పంట పూర్తి అయ్యేంత వరకు నీటి సరఫరా చేస్తారు. ఉపకాల్వలు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి నీరంత వృథా పోవడమే కాకుండా చివరి ఆయకట్టుకు అందదు. వేసవిలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఉప కాల్వలను శుభ్రం చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 01 , 2024 | 11:32 PM