Share News

ఇసుక ఎవరు దోచుకుపోతున్నారో చెప్పాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:42 AM

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాత ముత్తాతల ఆస్తిలాంటి ఇసుకను దోచుకుపోతున్నారని మాట్లాడిన అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి ఈనాడు ఇసుకను ఎవరు దోచుకుపోతున్నారో ప్రజలకు జవాబు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు డిమాండ్‌ చేశారు.

ఇసుక ఎవరు దోచుకుపోతున్నారో చెప్పాలి
ప్రధాన రహదారిని పరిశీలిస్తున్న పుట్ట మధు

మంత్రి శ్రీధర్‌బాబును ప్రశ్నించిన జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

మంథని, ఏప్రిల్‌ 15: అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాత ముత్తాతల ఆస్తిలాంటి ఇసుకను దోచుకుపోతున్నారని మాట్లాడిన అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి ఈనాడు ఇసుకను ఎవరు దోచుకుపోతున్నారో ప్రజలకు జవాబు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు డిమాండ్‌ చేశారు. ఇసుక లారీల ఓవర్‌ లోడ్‌తో ఛిద్రమైన మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిని సోమవారం పుట్ట మధు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనేక అబద్దాలు చెప్పిన మంత్రి ఈనాడు ఇసుక అక్రమ తరలింపుపై ఎందుకు స్పందించలేదన్నారు. మంత్రి ఎన్నికల్లో వంద కోట్లు ఎట్లా ఖర్చు చేశాడని, అంత పెద్ద డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనపుడు మరో రకంగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఇసుక క్వారీలు, లారీలు తనవేనని ప్రచారం చేశారని, ఈనాడు వందల కొద్ది అక్రమంగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీలన్నీ ఎవరివని ప్రశ్నించారు. వంద టన్నుల బరువు వెళ్లినా చెదిరిపోకుండా రోడ్ల నిర్మాణం చేస్తే నాలుగు నెలలు గడవ ముందే వంద టన్నుల కంటే ఎక్కువ బరువుతో ఇసుక లారీలు వెళ్తున్నాయని, దీంతో రోడ్డు మొత్తం పగిలిపోతుందన్నారు. అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే అక్కడక్కడ ఒకటి రెండు లారీలను పట్టుకుంటున్నారని, కానీ వందల కొద్ది లారీలు ఓవర్‌లోడ్‌ వెళ్తున్నాయని ఆరోపించారు. మంథని నియోజకవర్గంలో పదేళ్ల పాటు ప్రజలకు అనేక సేవలు, అభివృధ్ది చేసినా మూడు ఓట్లు లేని కుటుంబం ఇంత పెద్ద సమాజానికి మాయమాటలు, అబద్దాలు చెప్పి అధికారం చెలాయిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో నీళ్ల కింద ఇసుక వృధాగా పోవద్దని, కేసీఆర్‌ సర్కార్‌ ఇసుక తీసి ప్రజల అవసరాలకు వినియోగించడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమ చేసింద న్నారు. ఈనాడు మాత్రం ఇసుక క్వారీలు, లారీల డబ్బులు కాంగ్రెస్‌ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని, నియోజకవర్గంలో ఇసుక, బియ్యం, స్ర్కాప్‌, బెల్లం దందాలకు కాంగ్రెస్‌ నాయకులు ఇంచార్జీలుగా వ్యవహరిస్తే మంత్రి సోదరుడు నాయకత్వం వహిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయడం లేదని, ఇసుక క్వారీలు, లారీలు ఆగడం లేదని, అధికారంలో ఉండి ఒక్క మంచి హోదాలో ఉండి కూడా ఇసుక రవాణాను ఎందుకు ఆపుతలేరని ఆయన ప్రశ్నించారు. ఇసుక రవాణాను ఆపాలని సుల్తానాబాద్‌లో అన్ని పార్టీలు నాయకులు దీక్ష చేస్తున్నారని, అదే తరహాలో మంథనిలో కాంగ్రెస్‌ నాయకులు దీక్ష చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు తగరం శంకర్‌లాల్‌, ఏగోళపు శంకర్‌గౌడ్‌, కాయితి సమ్మయ్య, ఆసీఫ్‌ఖాన్‌, గోబ్బూరి వంశీలు ఉన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:42 AM