Share News

మట్టి మాఫియాపై కొరడా

ABN , Publish Date - May 24 , 2024 | 12:40 AM

జిల్లాలో అనుమతులకు మించి చెరువుల మట్టిని అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియాపై కొరడా ఝులిపిస్తున్నారు.

మట్టి మాఫియాపై కొరడా

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో అనుమతులకు మించి చెరువుల మట్టిని అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియాపై కొరడా ఝులిపిస్తున్నారు. ఎలాంటి వేబిల్లులు లేకుండా, ఓవర్‌లోడుతో రాత్రింబవళ్ళు లారీల్లో మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అధికారుల పర్యవేక్షణ లేకుండానే మట్టిని పెద్దఎత్తున అక్రమంగా తరలించడంతో జిల్లాస్థాయి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి కార్యాలయం వరకు ఫిర్యాదులు వెళ్లడంతో అధికారులు రంగంలోకి దిగారు. రెండు రోజుల నుంచి రెవెన్యూ శాఖ అధికారులు మట్టిని తరలిస్తున్న వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఈనెల 22న పెద్దపల్లి మండలం రాఘవపూర్‌ వద్ద 8 లారీలను రెవెన్యూ అధికారులు తనిఖీ చేయగా, ఏ ఒక్క దానికి కూడా పర్మిట్‌ లేదని, ఓవర్‌ లోడుతో మట్టిని తరలిస్తున్నారని గుర్తించారు. అలాగే గురువారం రామగుండం మండలం అల్లూరు చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని భావించిన అధికారులు లారీలను ఆపి తనిఖీ చేశారు. వేబిల్లులు లేకుండా మట్టిని తరలిస్తున్నారని గుర్తించిన అధికారులు ఐదు లారీలను సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వేసవికాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడైతే చెరువుల్లో నీళ్లు అడుగంటిపోతాయో ఆ చెరువులోని మట్టిని ఇటుక బట్టీలకు అక్రమంగా కొంతకాలంగా తరలిస్తూవస్తున్నారు.

జిల్లాలో 150కి పైగా ఇటుక బట్టీలు

జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్‌, కమాన్‌పూర్‌, రామగిరి, ధర్మారం, తదితర మండలాల్లో 150కి పైగా ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే ఇటుకలు నాణ్యతగా ఉంటాయని వాటికి డిమాండ్‌ ఉంటుంది. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ తదితర ప్రాంతాలకు ఇటుక సరఫరా చేస్తూ ఉంటారు. ఈ ఇటుకల తయారీకి చెరువులో ఉండే ఒండ్రు మట్టితో పాటు, ఫ్లైయాష్‌ కలిపి తయారుచేస్తూ ఉంటారు. వేసవిలో చెరువులో నీళ్లు తగ్గిన తర్వాత మట్టిని తరలిస్తూ ఉంటారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రంగా నుంచి అనుమతులు తీసుకొని తగిన మొత్తంలో సీనరేజీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే తక్కువ మొత్తంలో సీనరేజీ సొమ్ము చెల్లించి పెద్దమొత్తంలో అక్రమంగా మట్టిని తరలించుకపోతున్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉంటున్నాయి. ఈ ఏడాది కమాన్‌పూర్‌ మండలంలోని జూలపల్లి పెద్దచెరువులో మట్టిని తరలించేందుకు గౌరెడ్డిపేటకు చెందిన ఒక ఇటుక బట్టి యజమాని అనుమతులు తీసుకున్నారు. మొదట 4 వేల క్యూబిక్‌ మీటర్లకు, ఆ తర్వాత 2 వేల క్యూబిక్‌మీటర్లకు 3 లక్షల 84 వేల రూపాయల సీనరేజీ సొమ్ము చెల్లించారు. కానీ ఈ చెరువు నుంచి సుమారు 12 నుంచి 15 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రామగుండం మండలం అల్లూరు చెరువు మట్టిని తరలించేందుకు సుల్తానాబాద్‌ మండలం మియాపూర్‌కు చెందిన ఒక వ్యక్తి 2 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలించుకునేందుకు 1,28,000 సీనరేజ్‌ సొమ్మును చెల్లించారు. ఈ చెరువు నుంచి ఆరు రోజుల నుంచి రేయింబవళ్లు నిరాటంకంగా మట్టిని తరలించారు. ప్రభుత్వ నుంచి తీసుకున్న రెండు వేల క్యూబిక్‌ మీటర్లకు మించి ఎనిమిది నుంచి పదివేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ చెరువుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మట్టిని తరలించుకపోతున్నారని స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్థానికులతో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు కలెక్టర్‌కు, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు చేశారు. దీంతో రెండు రోజుల నుంచి అధికారులు మట్టి మాఫియాపై కొరడా ఝులిపిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి జూలపల్లి చెరువులో మట్టి తరలింపును రెవెన్యూ శాఖ అధికారులు నిలిపివేయించారు. గురువారం అల్లూరు చెరువులో కూడా మట్టి తరలింపును నిలిపివేశారు. ప్రభుత్వ అనుమతులకు మించి మట్టిని తరలించారని దీనిపై లోతుగా విచారణ జరిపి, అక్రమంగా మట్టిని తరలించుకపోయిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు సీనరేజీ సొమ్మును వసూలు చేయాలని స్థానికులు, బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 24 , 2024 | 12:40 AM