Share News

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పూర్తయ్యేదెన్నడో?

ABN , Publish Date - May 16 , 2024 | 12:22 AM

చొప్పదండి మున్సిపాలిటీగా మారి ఐదేళ్లు గడిచాయి. పన్నులు పెరిగాయే తప్ప ఎటువంటి మౌలిక సదుపాయాలు సమకూరలేదు.

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పూర్తయ్యేదెన్నడో?

చొప్పదండి, మే 15: చొప్పదండి మున్సిపాలిటీగా మారి ఐదేళ్లు గడిచాయి. పన్నులు పెరిగాయే తప్ప ఎటువంటి మౌలిక సదుపాయాలు సమకూరలేదు. ఇప్పటికీ సరైన మార్కెట్‌ లేక రోడ్డుపైనే మాంసం, కూరగాయల అమ్మకాలు కొనసాగుతున్నాయి. వారసంత 50 ఏళ్లుగా రోడ్డుపైనే కొనసాగుతుంది. 2022 ఫిబ్రవరిలో అప్పటి మంత్రి కేటీఆర్‌ రెండు కోట్ల నిధుల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆరునెలల తరువాత నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తరువాత పనులు నిలిపివేశారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో రోడ్డుకిరువైపులా కూరగాయలు, పండ్ల దుకాణాలు, మాంసం, చేపల అమ్మకాలు కొనసాగుతుండగా పోలీస్‌ స్టేషన్‌ రోడ్డుపై ప్రతి శుక్రవారం వారసంత కొనసాగుతుంది. ఈ రోడ్డుపై తహసిల్దార్‌, మండల పరిషత్‌, పోలీస్‌స్టేషన్‌, పోలీస్‌ క్వార్టర్స్‌, మున్సిపల్‌ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఇదే రహదారిపై వారసంత నిర్వహిస్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 16 , 2024 | 12:23 AM