Share News

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు పూర్తయ్యేదెన్నడు?

ABN , Publish Date - May 21 , 2024 | 01:05 AM

నగరంలో మార్కెట్ల విస్తరణ, సమీకృత మార్కెట్ల (ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్స్‌) నిర్మాణాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి.

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు పూర్తయ్యేదెన్నడు?
తొలగించిన కాశ్మీర్‌గడ్డ రైతుబజార్‌

- నత్తనడకన పనులు

- కశ్మీర్‌గడ్డ రైతు బజార్‌ తొలగింపుతో ఇబ్బందులు

కరీంనగర్‌ టౌన్‌, మే 20: నగరంలో మార్కెట్ల విస్తరణ, సమీకృత మార్కెట్ల (ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్స్‌) నిర్మాణాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. నగరం నలుదిశలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు చేరువలోకి మార్కెట్లు, పార్కుల వంటి అభివృద్ధి పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేయాల్సిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉంటుంది. పాలకుల నిర్లక్ష్యంతో మార్కెట్ల విస్తరణ జరగడం లేదు. నగరంలోని నాలుగు చోట్ల నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నగరంలో ప్రజలకు అందుబాటులో వెజ్‌, నాన్‌ వెజ్‌, పండ్లు ఒకే చోట లభ్యమయ్యేలా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల నిర్మాణాలకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. స్మార్ట్‌సిటీ, పట్టణ ప్రగతితోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో దశలవారీగా నిర్మించాలని నిర్ణయించి అవసరమైన ప్రణాళికలను రూపొందించింది.

మొదటి విడతలో నాలుగు మార్కెట్లు

మొదటి విడతలో పద్మనగర్‌, వ్యవసాయ (బీట్‌) మార్కెట్‌, కలెక్టరేట్‌ బంగ్లా ముందు, కశ్మీరుగడ్డ రైతు బజార్‌లో మార్కెట్ల నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు తీసుకుంది టెండర్‌ ప్రక్రియను పూర్తిచేసి పనులను ప్రారంభించింది. పద్మనగర్‌లో పట్టణ ప్రగతి నిధులు 15 కోట్లతో, వ్యవసాయ (బీట్‌) మార్కెట్‌లో 10 కోట్ల అంచనాలతో మార్కెట్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. రెండు చోట్ల పనులు పురోగతిలో ఉన్నారు. కలెక్టర్‌ బంగ్లా ఎదుట స్మార్ట్‌సిటీ నిధులు 14.5 కోట్లతో, కశ్మీరుగడ్డ రైతు బజార్‌ను తొలగించి అదే స్థలంలో 10 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. కలెక్టర్‌ బంగ్లా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు కొంత మేరకు జరుగగా, కశ్మీరుగడ్డ రైతుబజార్‌లో ప్రారంభదశలోనే పనులు నిలిచిపోయాయి.

కళ తప్పిన కశ్మీర్‌గడ్డ రైతు బజార్‌

కశ్మీర్‌గడ్డ, ముకరంపుర, సప్తగిరికాలనీ, శ్రీనగర్‌కాలనీ, గోదాంగడ్డ, మంకమ్మతోట, జ్యోతినగర్‌, భగత్‌నగర్‌ తదితర కాలనీల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కశ్మీర్‌గడ్డలో రైతుబజారును ఏర్పాటు చేశారు. ఈ రైతుబజారుకు సమీప గ్రామాల నుంచి రైతులే కూరగాయలను పండించి తీసుకువచ్చి అమ్ముకోవడంతోపాటు కొంత మంది చిరు వ్యాపారులు రైతుల నుంచి హోల్‌సేల్‌గా తీసుకుని విక్రయించేవారు. ప్రధాన కూరగాయల మార్కెట్‌, వీక్లీబజార్‌ రైతుబజార్లకు దీటుగా స్వచ్చమైన కూరగాయలు, పండ్లు, చేపలు, చికెన్‌, మటన్‌ విక్రయిస్తుండడంతో ప్రజల నుంచి చక్కటి ఆదరణ లభించింది. వేకువ జామున 5 గంటల నుంచే కశ్మీరుగడ్డ రైతుబజార్‌ ప్రాంతమంతా రద్దీగా ఉండేది. పండుగలు, శుభకార్యాల సమయంలో మరింత రద్దీ ఉండడంతో రైతులు, వ్యాపారులే కాకుండా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రైతుబజార్‌ను తొలగించి స్మార్ట్‌సిటీలో భాగంగా నిర్మించతలపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎనిమిది నెలల క్రితం మార్కెట్‌ను కూల్చివేసి సమీపంలోని తాత్కాలిక షెడ్లలో కూరగాయల విక్రయాలకు అనుమతిచ్చారు. రైతుబజార్‌ను తొలగించడంతో రైతులు పూర్తిగా రావడం మానేశారు. వ్యాపారులు కూడా అక్కడొక్కరు ఇక్కడొకరు కూర్చోని కూరగాయలు విక్రయిస్తుండడంతో రద్దీ పూర్తిగా తగ్గిపోయి కాశ్మీరుగడ్డ రైతుబజార్‌ కళతప్పిపోయింది.

నిధులు విడుదలయ్యేనా?

ఈ మార్కెట్లన్నింటిని వీలైనంత త్వరగా నిర్మించి ప్రజలకు డిసెంబరులోగానే అందుబాటులోకి తెస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించారు. పద్మనగర్‌, బీట్‌ మార్కెట్‌లలో మార్కెట్‌ నిర్మాణ పనులు చాలా వేగంగా జరగడంతో ప్రారంభిస్తారని ప్రజలు కూడా ఆశించారు. కలెక్టర్‌ బంగ్లా ఎదుట చేపడుతున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవన సముదాయం పనులు పూర్తయితే ప్రధాన కూరగాయల మార్కెట్‌, చేపల, మాంసం మార్కెట్‌, ఫ్రూట్‌ మార్కెట్లలోని సమస్యలు చాలా మేరకు తగ్గుతాయని భావించారు. ఏడాది నుంచి ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నా ఆశించిన మేరకు వేగంగా చేపట్టక పోవడంతో పూర్తికాలేదు. ఇప్పుడు ఆ పనులు పూర్తికావాలంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి, జీవో 65 నిధులతోపాటు స్మార్ట్‌సిటీ కింద కేంద్ర, రాష్ట్ర వాటా నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది.

Updated Date - May 21 , 2024 | 01:05 AM