Share News

భద్రతపై పట్టింపేది..?

ABN , Publish Date - May 22 , 2024 | 01:34 AM

ఉత్తర తెలంగాణలోనే అత్యధిక రద్దీగా ఉండే కరీంనగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణీకుల భద్రతను గాలికి వదిలేశారు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రయాణీకుల భద్రతపై చూపించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

భద్రతపై పట్టింపేది..?

కరీంనగర్‌ క్రైం, మే 21: ఉత్తర తెలంగాణలోనే అత్యధిక రద్దీగా ఉండే కరీంనగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణీకుల భద్రతను గాలికి వదిలేశారు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రయాణీకుల భద్రతపై చూపించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రతి రోజు కిక్కిరిసిన ప్రయాణీకులతో రద్దీగా ఉండే కరీంనగర్‌ బస్టాండ్‌లో నిఘా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. బస్టాండ్‌లో తరచూ ప్రయాణికుల బ్యాగ్‌లు, సెల్‌ఫోన్‌లు, పర్సులు దొంగతనాలకు గురవుతూనే ఉన్నాయి. ప్రయాణికులకు భద్రత కల్పించే చర్యలు చేపట్టడంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కరీంనగర్‌లోని మతాతాశిశు కేంద్రంలో ఒక శిశువును మహిళ అపహరించుకుపోగా ఆమె బస్టాండ్‌కు వచ్చి బస్సులో వెళ్లింది. ఆ వివరాల కోసం బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా పనిచేయలేదు. అంతకుముందు గోదావరిఖని నుంచి ఒక వృద్ధురాలు కరీంనగర్‌కు వచ్చి బస్సుదిగి ప్లాట్‌ఫాం వద్దకు వెళుతున్న సమయంలో బ్యాగ్‌ చూసే సరికి తెరచి ఉంది. బ్యాగ్‌లోని 18 తులాల బంగారు ఆభరనాలు దొంగతనానికి గురయ్యాయ. ఈ ఘటనలో కూడా పోలీసులు బస్టాండ్‌కు వెళితే సీసీ కెమెరాలు పనిచేయటంలేదని సమధానం వచ్చింది.

ఫ నాలుగేళ్ల క్రితం 72 సీసీ కెమెరాల ఏర్పాటు

బస్టాండ్‌లో దొంగతనాలతోపాటు రాత్రి సమయాల్లో అసాంఘీక కార్యకలాపాలు కూడా అధికమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో అధికశాతం పేద, మధ్య తరగతి వర్గాలకు చెందినవారే ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ వర్గాలకు చెందిన ప్రజలే బాధితులుగా మారుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగేళ్ల క్రితం ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణ మొత్తం కవర్‌ చేస్తూ 72 సీసీకెమెరాలను ఏర్పాటు చేసి, బస్టాండ్‌ కాంప్లెక్స్‌లోనే ఒక కమాండ్‌కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లో అవుట్‌పోస్ట్‌ ఏర్పాటు చేసి ఇద్దరు హోంగార్డులను 24 గంటలు విధులలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం కరోనా కారణంగా అవుట్‌పోస్ట్‌ను ఎత్తివేశారు.

ఫ నిర్వహణ లేక మూలనపడ్డ కెమెరాలు..

బస్టాండ్‌లోని సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యతను కరీంనగర్‌ బోయవాడలోని ఒక సీసీకెమెరాల సంస్థకు అప్పగించారు. సీసీ కెమెరాల మరమ్మతుల ఖర్చుల చెల్లింపు బిల్లులు చెల్లించకపోవడంతో ఆ సంస్థ నిర్వహణ బాద్యతల నుంచి తప్పుకుంది. దీంతో అప్పటి నుంచి సీసీ కెమెరాలకు మరమ్మత్తులు నిర్వహించక పోవటంతో బస్టాండ్‌ ఆవరణలోని 52 సీసీ కెమెరాలు పనిచేయకుండా పోయాయి. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో బస్టాండ్‌లో జరిగే చోరీలు, పోకిరీల వేధింపులు, అసాంఘిక కార్యకలాపాల సమాచారం, నిందితులను గుర్తించే వీలు లేకుండా పోతున్నది. కరీంనగర్‌ నుంచి ప్రతిరోజు లక్షా 20 వేల మంది వరకు ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తమ ప్రయాణాలను సాగిస్తుంటారు. ప్రయాణికుల రవాణాతో భారీగా ఆదాయం సమకూరుతున్నది. అయినా సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించడం లేదు. గతంలో బస్టాండ్‌లోని సీసీ కెమెరాల ద్వారా చాలా కేసుల్లో నిందితులను పోలీసులు గుర్తించి పట్టుకున్న సందర్భాలున్నాయి.

ఫ త్వరలోనే సీసీ కెమెరాలను పునరుద్ధరిస్తాం

- రజనీ కృష్ణ, కరీంనగర్‌ డిపో ట్రాఫిక్‌ మేనేజర్‌

కరీంనగర్‌ బస్టాండ్‌ ఆవరణలో ఉన్న కొన్ని సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. వీటి మరమ్మత్తులు, కొత్తగా ఏర్పాటు చేసే సీసీ కెమెరాల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే సీసీకెమెరాలను పునరుద్ధరిస్తాం. బస్టాండ్‌లో ప్రయాణికుల భద్రతకు అన్నిరకాల చర్యలు తీసుకుంటాం.

Updated Date - May 22 , 2024 | 01:34 AM