Share News

అనధికారిక లేఅవుట్లపై చర్యలేవి?

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:47 AM

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అనధికారిక లేఅవుట్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

అనధికారిక లేఅవుట్లపై చర్యలేవి?

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 11: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అనధికారిక లేఅవుట్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి దర్జాగా విక్రయిస్తున్నారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో సైతం ప్లాట్లు పెట్టి విక్రయాలు జరుపుతున్నారు. వివాదాస్పద భూములు, కోర్టు వివాదాల్లోని భూముల్లో సైతం లే అవుట్లు పెట్టి మాయమాటలతో సామాన్యులకు ప్లాట్లు కట్టబెడుతున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌, డీటీసీపీ నుంచి ఎలాంటి లే అవుట్‌ అనుమతులు లేకుండానే కోట్ల రూపాయల లావాదేవీలు జరిగిపోతున్నాయి. కార్పొరేషన్‌ పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతోంది. రియల్టర్లు మాత్రం అనధికారిక లే అవుట్లకు మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఇతర శాఖలకు, ప్రజాప్రతినిధులకు విస్తీర్ణాన్ని బట్టి మామూళ్లు ఇస్తూ నిరాటకంగా దందా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

రామగుండం నగరపాకల సంస్థ పరిధిలో 80శాతం భూములు ఎన్‌టీపీసీ, సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, జెన్‌కో పరిధిలో ఉన్నాయి. మిగిలిన 20శాతం ప్రైవేట్‌ భూముల్లోనే కాలనీలు ఉన్నాయి. ఇందులో శివారు గ్రామాల పరిసరాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులోనే రియల్‌ ఎస్టేట్‌ దందా సాగుతోంది. రామగుండం నగపాలక సంస్థ పరిధిలోని ఎన్‌టీపీసీ ఇందిరమ్మ కాలనీ, కృష్ణనగర్‌, మాతంగికాలనీ, గోదావరిఖని అడ్డగుంటపల్లి, దుర్గానగర్‌ బృందావన్‌ గార్డెన్‌ ఏరియా, గోదావరిఖని సప్తగిరికాలనీలోని ఎస్‌టీపీ ఏరియాలు, స్విమ్మింగ్‌పూల్‌ సమీపాల్లో కొత్తగా వెంచర్లు పుట్టుకొచ్చాయి. గోదావరి వరదల్లో రెండేళ్లు ముంపునకు గురైన ముంపు ప్రాంతాల్లోనూ కొత్తగా వెంచర్లు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం గోదావరి ముంపు ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఏకంగా అనేధికారిక లే అవుట్లే పుట్టకొస్తున్నాయి. వ్యవసాయ భూములును కొని నాలా కన్వర్షన్‌తో నేరుగా లే అవుట్లు వేస్తున్నారు. ప్రభుత్వం అనధికారిక లే అవుట్లను కట్టడి చేసేందుకు 2021లో ప్రత్యేక జీవో తీసుకువచ్చింది. ఈ జీవోను అనుసరించి రెండు ఎకరాల భూములకు కూడా లే అవుట్‌ చేసేందుకు అవకాశం ఉంది. 10శాతం ఓపెన్‌ స్పేస్‌ వదిలిపెట్టడం, రోడ్లు, డ్రైన్లు, విద్యుత్‌, ఇతర సౌకర్యాలు కల్పించడం వంటివి చేయాల్సి ఉంది. ఇందుకు 60అడుగుల అప్రోచ్‌ రోడ్డుతో పాటు 30అడుగుల రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎలాంటి అప్రువల్‌ లేకుండానే వెంచర్లు చేస్తున్నారు.

కార్పొరేషన్‌ ఆదాయానికి గండి

రామగుండం నరపాలక సంస్థ అక్రమ లేఅవుట్ల వెనుక టౌన్‌ప్లానింగ్‌ పరోక్ష సహకారాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఎకరాల కొద్ది భూముల్లో అనధికారిక లేఅవుట్లు పెట్టి క్రయ, విక్రయాలు జరుగుపుతున్నా పట్టించుకున్న పరిస్థితి లేదు. పలు అనధికారిక లే అవుట్లలో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన డ్రైన్లను సైతం ఆక్రమిస్తున్నారు. లేఅవుట్ల అనుమతి కింద కార్పొరేషన్‌కు రావాల్సిన ఫీజులు, ఇతర ఆదాయాలు, ఓపెన్‌ స్పేస్‌లు రాకుండా పోతున్నాయి. అనధికారిక లే అవుట్లకు కార్పొరేషన్‌ అధికారిక అనుమతి కన్నా అనధికారిక అనుమతులే ఇప్పుడు కీలకమయ్యాయనే ఆరోపణలున్నాయి. గతంలో ఒకటి రెండు లే అవుట్లలో హద్దురాళ్లు తొలగించడం, మళ్లీ వారు దందా చేసుకునేందుకు అనధికారిక క్లియరెన్స్‌లు ఇవ్వడం పరిపాటి అయ్యింది. లే అవుట్ల విస్తీర్ణాన్ని బట్టి శాఖల వారీగా రేట్లు నిర్ణయించి క్లియర్‌ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

అడ్రస్‌ లేని టాస్క్‌ఫోర్స్‌

జిల్లాలో అనధికారిక లేఅవుట్లు, నిర్మాణాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో అనధికారిక లే అవుట్లు, నిర్మాణాలను టౌన్‌ ప్లానింగ్‌ అడ్డుకోవాల్సి ఉంటుంది. అలా వీలు కాని సమయంలో టాస్క్‌ఫోర్స్‌కు నివేదిస్తారు. టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగి కూల్చివేతలు, తొలగింపులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ అలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.

Updated Date - Apr 12 , 2024 | 12:47 AM