Share News

బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేస్తాం

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:18 AM

కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో బీఆర్‌ఎస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేస్తాం

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 4: కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో బీఆర్‌ఎస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో గంగుల కమలాకర్‌ ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కేడర్‌తో కలిసి కట్టుగా కష్టపడి ఎంపీగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను గెలిపించుకుంటామని అన్నారు. ఎంపీగా వినోద్‌కుమార్‌ లేకపోవడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆశించిన మేరకు జరుగలేదని, చాలా పనులు నిలిచిపోయాయని అన్నారు. అయినా కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో కాంగ్రెస్‌ కంటే బీఆర్‌ఎస్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా అమలు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబుకు గుర్తు చేస్తున్నామని కమలాకర్‌ అన్నారు. ముగ్గురు బీజేపీ సీఎం అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ ఓడించిందని ఈ సందర్భంగా కమలాకర్‌ గుర్తు చేశారు. ఇప్పటి వరకు రైతుబంధు డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయలేదని, దీంతో రైతులు నాట్లు వేసుకునేందుకు, విత్తనాలను కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు నాట్లు వేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారని, డిసెంబరు 3వ తేదీన ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్లు జనవరి 3వ తేదీ వరకు కూడా ఇవ్వలేదని, లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 05 , 2024 | 12:18 AM