Share News

రైతులకు అండగా ఉంటాం

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:05 AM

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుందని అధైర్య పడవద్దని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని మొగ్దుంపూర్‌ గ్రామంలో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు.

రైతులకు అండగా ఉంటాం
ముగ్ధుంపూర్‌లో వరి పంటను పరిశీలిస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

- మేడిగడ్డలో పదివేలమంది రైతులతో ధర్నా

- నష్టపోయిన రైతులకు 25 వేల నష్టపరిహారం అందించాలి

- మాజీ సీఎం కేసీఆర్‌.. మొగ్దుంపూర్‌లో ఎండిన పంటల పరిశీలన

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుందని అధైర్య పడవద్దని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని మొగ్దుంపూర్‌ గ్రామంలో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని రైతుల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు.

ఈ సందర్భంగా మొగ్ధుంపూర్‌ గ్రామానికి చెందిన రైతులు తమ పంటలు ఎండి పోతున్నాయని కేసీఆర్‌తో మొరపెట్టుకున్నారు. మొగ్ధుంపూర్‌ మాజీ సర్పంచ్‌ జక్కం నర్సయ్య మాట్లాడుతూ గ్రామంలో పంటలు ఎండుతున్నా పట్టించుకునేవారు లేరన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి డి89 కెనాల్‌ ద్వారా ఇరుకుల్ల (గుండి) వాగు ద్వారా చెరువుల్లోకి సమృద్ధిగా నీరందితే పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉండేవి కావని తెలిపారు. గత పంటకాలంలో ఒక్కమొగ్ధుంపూర్‌ నుంచే 18 వేల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నాం. ప్రస్తుతం 6 వేల క్వింటాళ్లు కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించే పరిస్థితి లేదని మొరపెట్టుకున్నారు. మొగ్దుంపూర్‌ గ్రామంలో 1000 ఎకరాలకుగాను 600 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. మరో రెండు విడతల సాగునీరు అందితే రైతుల పంటలు దక్కేవని కేసీఆర్‌కు మొరపెట్టుకున్నారు. రైతులు బండి సంపత్‌తోపాటు, కొలగాని సంపత్‌, వేల్పుల నర్సయ్య, దాడి లచ్చయ్య, కొలగాని రాజయ్య, దాడి కనుకయ్య, బొల్లె బాలరాజు, వాగటి హన్మయ్య, దుర్గ మల్లయ్య, చంద్రయ్య, మంద తిరుపతి, అంజిరెడ్డి, అంజయ్యలు తమ పొలాలు ఎండిపోయాయని కేసీఆర్‌కు వివరించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ రైతుల భుజం తట్టి అధైర్యపడవద్దు అండగా ఉంటామన్నారు. ఎన్నికల అనంతరం మేడిగడ్డలో పెద్ద ఎత్తున రైతులతో ధర్నా నిర్వహిస్తామన్నారు. బండి సంపత్‌ అనే రైతు తన పొలాన్ని చూపిస్తూ తాను మూడున్నర ఎకరాలు సాగుచేశానని పంట మొత్తం పశువుల మేతకే పనిచేస్తుందన్నారు. దాడి లచ్చయ్య అనే రైతు తాను ఐదున్నర ఎకరాలు కౌలు తీసుకుని సాగుచేశానని పూర్తిగా సాగునీరు లేక ఎండిపోయిందన్నారు. రైతుల పంటలను పరిశీలించిన కేసీఆర్‌ రైతులకు భరోసా కల్పిస్తూ అధైర్య పడవద్దు మీకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. ఎండిపోయిన పంటలకు రైతులకు ఎకరాకు 25 వేల రూపాయల నష్ట పరిహారం అందించాలన్నారు. మేడిగడ్డలో పదివేల మంది రైతులతో ఽప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపడుతామన్నారు. ఒక వైపు పంటలు ఎండిపోతుంటే పట్టించుకోవడం లేదు. రైతులు ధైర్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు. మరో రెండు విడతలు కాలువల ద్వారా నీరందిస్తే రైతుల పంటలు చేతికొచ్చేవన్నారు. ప్రభుత్వం సాగునీరు అందించే విషయంలో ముందుచూపు లేకుండా పోయిందన్నారు. రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యుడు గంగుల కమలాకర్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, కరీంనగర్‌ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, చల్ల హరిశంకర్‌, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రామడుగులో...

రామడుగు: ఎండిపోయిన వరితో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మండలంలోని వెదిర గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం మొరపెట్టుకున్నారు. రామడుగు నుంచి బోయినిపల్లికి వెల్లుతున్న కేసీఆర్‌ బస్సు యాత్రను రైతులు వరి గొలుసుతో స్వాగతం పలికారు. రైతులు రావడంతో బస్సు దిగిన కేసీఆర్‌ వారితో కొద్దిసేపు ముచ్చటించారు. సాగునీరు సక్రమంగా అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు కేసీఆర్‌ దృష్టికి తీసుకవచ్చారు. విద్యుత్‌ సరఫరాలో పలు సార్లు అంతరాయం ఏర్పడి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఏకరువు పెట్టారు. స్పందించిన కేసీఆర్‌ అదైర్యపడవద్దని దైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఉన్నారు.

గంగాధరలో...

గంగాధర: ఎండిన పంటల పరిశీలనలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌ నుంచి బోయినపల్లికి వెళ్తూ గంగాధర మండలం కురిక్యాల రోడ్డుపై రైతులతో ఆయన వాహనంలో ఉండి మాట్లాడారు. గంగాధర సింగిల్‌ విండో చైర్మన్‌ దూలం బాలగౌడ్‌ మాట్లాడుతూ నీరు లేక వరద కాలువ ఆయకట్టు 8 ఎకరాలు ఎండిపోయినట్లు తెలిపారు. మరో రెండు వందల ఎకరాలు ఎండిపోవడానికి సిద్ధంగా ఉందని మాజీ సీఎంకు తెలిపారు. స్పందించిన కేసీఆర్‌ కురి క్యాలలో రైతు అందించిన వరి గొలకను తీసుకుని సాగునీటి కోసం సిద్ధమేనా అని రైతులను ప్రశ్నించారు. రైతులకు సాగునీరందించే వరకు పోరాటం చేసుడేనని కేసీఆర్‌ అన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:05 AM