ఓటరు జాబితాలోని లోటుపాట్లను సవరించాం
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:04 AM
కరీంనగర్ అసెంబ్లీ పరిధిలోని ఓటరు జాబితాలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి లోటుపాట్లను సర్వేచేసి పకడ్బందీగా సవరించామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.

కరీంనగర్ టౌన్, మార్చి 5: కరీంనగర్ అసెంబ్లీ పరిధిలోని ఓటరు జాబితాలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి లోటుపాట్లను సర్వేచేసి పకడ్బందీగా సవరించామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో అధికారులతో ఓటరుజాబితాపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ పరిధిలో బీఎల్‌వోలు ఓటరు జాబితాపె సర్వే చేశారని అన్నారు. రెండు చోట్ల ఉన్న ఓట్లు, మృతి చెందిన వారి ఓట్లను తొలగించామన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం డిప్యూటీ సీఈవో హరిసింగ్, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, ఆర్డీవో కె మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
- దివ్యాంగులు ఆర్థికంగా ఎదగాలి
దివ్యాంగులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉమెన్ ఎంపవర్‌మెంట్ పథకం కింద యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తోట సుజాత అనే దివ్యాంగురాలికి అందించిన జిరాక్స్ మిషన్‌ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. మెప్మా ఆధ్వర్యంలో ఆదర్శ సంఘంలో సభ్యురాలిగా సుజాత కొనసాగుతున్నారు. లక్ష రూపాయల విలువ చేసే జిరాక్స్ మిషన్‌ను ఆమెకు బ్యాంకు అందించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణి ంచడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్‌దేశాయ్, మెప్మా పీడీ రవీందర్, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, యూనియన్ బ్యాంకు రీజినల్ హెడ్ అపర్ణరెడ్డి పాల్గొన్నారు.