Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

కరీంనగర్‌ ప్రజలకు రుణపడి ఉంటా

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:07 AM

కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని, వారు వేసిన ఓట్లతోనే తాను ఎంపీగా ఎన్నికయ్యానని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశానని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

 కరీంనగర్‌ ప్రజలకు రుణపడి ఉంటా

హుజూరాబాద్‌, మార్చి 3: కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని, వారు వేసిన ఓట్లతోనే తాను ఎంపీగా ఎన్నికయ్యానని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశానని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మళ్లీ తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌ పార్లమెంట్‌ అభివద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆయన చేపట్టిన ప్రజాహిత యాత్ర ఆదివారం హుజూరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికి, గజమాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనను రెండోసారి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో గతంలో కంటే భారీ మెజార్టీతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటికి కోతలు పెడుతూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన 10 లక్షల మంది పేద కుటుంబాలకు ఇంత వరకు కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వలేదన్నారు. వాళ్లకు ఆరు గ్యారంటీలు రావన్నారు. రాష్ట్రంలో 90లక్షల తెల్ల రేషన్‌ కార్డులు ఉంటే అందులో 40లక్షల మందికి మాత్రమే 500 రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చినవి ఆరు గ్యారెంటీలు కాదు ఆరు మోసాలని ప్రజలకు అర్థమైందన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బోర్నపల్లిలో పల్స్‌ పోలియో కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, గంగిశెట్టి రాజు, పైళ్ల వెంకట్‌రెడ్డి, బింగి కరుణాకర్‌, శశిధర్‌, వేణు, దేవేందర్‌, ప్రభాకర్‌, చంద్రిక తదితరులు పాల్గొన్నారు.

- మోదీతోనే పేదవారికి న్యాయం

సైదాపూర్‌: చాయ్‌ అమ్ముకునే వ్యక్తి అయిన మోదీ ప్రధాని అయ్యాడు కాబట్టే దేశంలో పేదోళ్లకు న్యాయం జరుగుతున్నదని ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. బండి సంజయ్‌ ప్రజాహిత యాత్రలో భాగంగా మండలంలోని అమ్మనగుర్తి, బొమ్మకల్‌, రాయికల్‌, ఘనపూర్‌, సైదాపూర్‌, సోమారం, వెన్నంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ది చెందుతున్నాయంటే అది మోదీ చలవేనన్నారు. కేసీఆర్‌ తెలంగాణను అప్పుల పాలు చేశాడని విమర్శించారు. నరేంద్ర మోదీ హయాంలో రాముడి గుడి కట్టారని తరతరాలుగా చెప్పుకుంటారన్నారు. 150 రోజులు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని పేద ప్రజల కోసం కొట్లాడినందుకు తనపై 100 కేసులు పెట్టారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ జల్లా మల్లేష్‌, మాజీ సర్పంచ్‌ కేడీకే మధుకర్‌రెడ్డి, నాయకులు ప్రవీణ్‌రావు, తిరుపతి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

- ధర్మం కోసం... దేశం కోసం పనిచేసే యువత కావాలి...

శంకరపట్నం: యువత రోజులో ఒక గంట ధర్మం కోసం.. దేశం కోసం పేద ప్రజల కోసం పనిచేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ప్రజాహిత యాత్రలో భాగంగా బండి సంజయ్‌ సైదాపూర్‌ మండలం నుంచి వీణవంక వెళ్లే క్రమంలో మండలంలోని మొలంగూర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొలంగూర్‌ ఖిల్లా వద్ద దూద్‌బావిని పరిశీలించారు. అక్కడే భోజనం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నాలుగు నియోజకవర్గాలలో ప్రజాహిత యాత్ర పూర్తి చేశామన్నారు. ప్రజాహిత యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని, నరేంద్రమోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్నారు.

ఫ ధర్మం కోసం పోరాడే పార్టీ బీజేపీ

వీణవంక: భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పోరాడే పార్టీ అని ఎంపీ బండి సంజయ్‌ కూమార్‌ అన్నారు. ప్రజాహిత యాత్రలో బాగంగా వీణవంక మండలంలోని వీణవంక చల్లురు,ఎల్బాక గంగారం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందార్బంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ హిందూ ధర్మం కోసం పోరాడకపోతే తెలంగాణలో హిందువులు బొట్టు పెట్టుకుని తిరిగే పరిస్థితి ఉండేది కాదన్నారు. కేసీఆర్‌ పని పాట లేకుండా ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని విమర్శించారు. మోదీతోనే దేశాభివృద్ది సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రామిడి ఆదిరెడ్డి, పెద్ది మాల్లారెడ్డి, చెన్నమాధవుని నర్సింహరాజు, పుప్పాల రఘు, శ్రీనివాస్‌రెడ్డి, బత్తిని నరేష్‌గౌడ్‌, రాజు, మారం తిరుపతిరెడ్డి, బొబ్బల విజయ్‌కూమార్‌, కంకల సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:07 AM