Share News

నిబంధనలకు నీళ్లు

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:42 AM

నీటి శుద్ధి పేరిట దోపిడీ జరుగుతోంది.

నిబంధనలకు నీళ్లు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

నీటి శుద్ధి పేరిట దోపిడీ జరుగుతోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటర్‌ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తూ జనాన్ని మోసం చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లు ఒదు లుతున్నారు. ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధ జలాలు అందిస్తున్నా జిల్లా ప్రజలు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఫ్యూరిఫైరిడ్‌ వాటర్‌గా భావిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా వాటర్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఐఎస్‌ఐ నిబంధనలు పాటించకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మినరల్‌ వాటర్‌తో మోసపోతూనే ఉన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోనే 120కు పైగా ఉండగా జిల్లాలోని మండలాలు గ్రామాల్లో కలుపుకుంటే 800 వరకు వాటర్‌ ప్లాంట్‌లు ఉన్నాయి. గల్లీకో వాటర్‌ ప్లాంటే కాకుండా ఇళ్లలో కూడా ప్లాంట్‌లు ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. నీటి శుద్ధతపై పర్యవేక్షణ లేకపోవడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. మున్సిపల్‌ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

అనుమతులు లేకుండానే..

మినరల్‌ వాటర్‌ పేరిట నిబంధనలకు వ్యాపారులు నీళ్లు వదులుతున్నారు. మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు బీఐఎస్‌, ఐఎస్‌ఐ నుంచి సర్టిఫికెట్లు పొందాలి. వాల్టా చట్టం కింద భూగర్భ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. మున్సిపల్‌, గ్రామ పంచాయతీ, రెవెన్యూ, కార్మిక, కాలుష్యమండలి, ప్రజారోగ్య, తూనికలు, కొలతలు, జిల్లా పుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, విద్యుత్‌, వాణిజ్య పన్నుల శాఖల నుంచి అనుమతులు ఉండాలి. ఈ అనుమతులేవి పాటించడం లేదు. దీంతోపాటు ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు సంబంధించిన నిబంధనల ప్రకారం పుడ్‌ కంట్రోలర్‌, పుడ్‌ ఇన్‌స్పెక్టర్‌లు ప్లాంట్‌ను సీజ్‌ చేసి క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేయవచ్చు. కానీ సిరిసిల్లతో పాటు గ్రామాల్లో కూడా అనుమతులు లేకుండానే ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. నీటిలో అత్యధికంగా టోటల్‌ డిజాల్స్‌ సాలీడ్స్‌ (టీడీఎస్‌) పరిమితికి మించి ఉంటే ఆ నీటిని విషతుల్యంగానే భావిస్తారు. ఆ నీరు తాగితే మూత్ర పిండాలు, జీర్ణవ్యవస్థ దెబ్బతింటాయి. అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటారు. పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న ఆర్వో ప్లాంట్ల నిర్వాహకులు బోరుకు మోటార్లు వేస్తూ రివర్స్‌ ఆస్మోసిస్‌ పద్ధతిలో జలాలను శుభ్రపరుస్తూ విక్రయిస్తున్నారు. వృఽథా నీటిలో టీడీఎస్‌ ఉంటుంది. భూగర్భ జలాల్లోకి పంపడ, డ్రైనేజీల్లో కలవడం ద్వారా నష్టానే కలిగిస్తాయి. వస్తున్న నీటిని డ్రై బెడ్స్‌లో కేక్‌గా మార్చి పారబోయాల్సి ఉంటుంది. ఇందుకు ప్లాంట్‌ విశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. ఇళ్ల మధ్య ఉండడం ద్వారా ఇలాంటివి ఎవరూ పాటించడం లేదు. అధికారులు కూడా తనిఖీలు చేయడం లేదు. ప్లాంట్లలో కూడా రసాయనాలు ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్నారు.

పాటించని శుభ్రత

నిబంధనలకు విరుద్ధంగా వాటర్‌ ప్లాంట్‌లలో నీటి శుద్ధి జరుగుతున్నట్లు తెలుస్తున్నా కనీసం నీళ్లకు ఉపయోగించే డబ్బాలను కూడా శుభ్రం చేయడం లేదు. వాటినే యఽథావిధిగా ఉపయోగించడంతో క్యాన్లలో ఫంగస్‌ ఏర్పడి రోగాల బారిన పడుతున్నారు. ఇళ్లలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల నిర్వహణ కూడా పట్టించుకునే వారే లేకపోవడంతో నిర్వహాకులకు ఇష్టారాజ్యంగా మారింది. నిత్యం ఇళ్లలో వాడే వాటర్‌ క్యాన్‌లు రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలను అనారోగ్యం పాలు జేస్తోంది.

Updated Date - Apr 07 , 2024 | 12:42 AM