భవిష్యత్‌లో అన్ని కోర్టుల్లో వర్చువల్ విధానం
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:36 AM
భవిష్యత్‌లో వర్చువల్ విధానంలోనే కోర్టులు నడుస్తాయని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా ఆడ్మినిస్ట్రేటీవ్ జడ్జి జస్టిస్ టి.మాధవిదేవి అన్నారు. శనివారం జిల్లా కోర్టు పరిధిలో సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జె.శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు.
సిరిసిల్ల క్రైం, జనవరి 27: భవిష్యత్‌లో వర్చువల్ విధానంలోనే కోర్టులు నడుస్తాయని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా ఆడ్మినిస్ట్రేటీవ్ జడ్జి జస్టిస్ టి.మాధవిదేవి అన్నారు. శనివారం జిల్లా కోర్టు పరిధిలో సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జె.శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం హైకోర్టులో వర్చువల్ విధానం అందుబాటులో ఉందని, భవిష్యత్‌లో అన్ని కోర్టుల్లో అమలు కానుందని అన్నారు. ఇంతకుముందు న్యాయమూర్తుల సమక్షంలో న్యాయవాదులు, కక్షిదారులు, సాక్షులు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉండేదని, ఇపుడు వర్చువల్ విధానంలోనే ఎవరైనా హాజరుకావచ్చని అన్నారు. జిల్లా కోర్టుల్లోనూ ఈ-ఫైలింగ్ విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే జగిత్యాలలో ప్రారంభమైనట్లు, త్వరలో సిరిసిల్లలోనూ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. దీంతో న్యాయవాదులు ఇంటి వద్దనుంచే ఈ-ఫైలింగ్ చేసుకోవచ్చన్నారు. నిత్యశోధన ద్వారానే న్యాయవాద వృత్తిలో రాణించవచ్చన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గూగుల్‌పైనే ఆధారపడడం కాకుండా స్వయంగా పుస్తకపఠనం చేయాలన్నారు. జడ్జిమెంట్‌లన్నీ కూలంకషంగా చదివి ఆకలింపు చేసుకోవాలన్నారు. సీనియర్‌ల వద్ద జూనియర్‌లు ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. కొత్తగా వచ్చే న్యాయవాదులను జ్యుడీషియల్ ఆఫిసర్‌లుగా తీర్చిదిద్దేందుకు సీనియర్‌లు ఉచితంగా శిక్షణతరగతులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ విధానం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగించడంతో ఎక్కువగా ఆ ప్రాంతం నుంచే జ్యుడీషియల్ ఆఫీసర్‌లు తయారవుతున్నారన్నారు. జనాభాకు సరిపడా అదనపు కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సివిల్, క్రిమినల్ కేసులు పెరుగుతున్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. సిరిసిల్ల చేనేత, వ్యవసాయరంగానికి ఎంతో పేరుందని, వేములవాడలో అతిపెద్ద శైవక్షేత్రం ఉండడం, దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. జిల్లా కోర్టు సముదాయాన్ని పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని, స్థలం అనువుకాకుంటే పాత కోర్టు స్థ్థలంలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. హైకోర్టులో 26మంది న్యాయమూర్తుల్లో ఎనిమిది మంది మహిళలు ఉండడం గర్వంగా ఉందన్నారు. తాను రామగుండంలోనే ప్రాథమిక విద్య అభ్యసించానని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. మహిళలు న్యాయవాద వృత్తిలో రాణించాలన్నారు. సిరిసిల్లలో ఖాళీగా ఉన్న జూనియర్ సివిల్ జడ్జిల పోస్టుల భర్తీకి కృషి చేస్తామన్నారు. హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ హైకోర్టు జడ్జిగా తాను సొంత జిల్లాకు అధికారికంగా రావడం సంతోషంగా ఉందన్నారు. జూనియర్ న్యాయవాదులను సీనియర్‌లు ఆర్థికంగా తోడ్పాటునందించి న్యాయ సలహాలు ఇవ్వాలన్నారు. జూనియర్‌లు సీనియర్‌ల నిబద్ధతను, అనుభవాలను నేర్చుకోవాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత మాట్లాడుతూ సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టుకు తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌లకు సంబంధించిన 2183 కేసులు బదిలీ చేశామన్నారు. జిల్లాలో దాదాపు తొమ్మిది వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అనంతరం హైకోర్టు జడ్జిలు కోర్టు స్థలాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, పూజారి గౌతమి, బార్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మణ్‌కుమార్, జగిత్యాల జిల్లా జడ్జి నీలిమ, సీనియర్ సివిల్ జడ్జిలు శ్రీలేఖ, సట్టు రవీందర్, జూనియర్ సివిల్ జడ్జిలు ప్రవీణ్, వినీల్‌కుమార్, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడి లక్ష్మణ్, కార్యదర్శి అనిల్‌కుమార్, ఆడెపు వేణు, నాగరాజు, కిషన్, గోవర్ధన్‌రెడ్డి, సురేశ్‌ప్రసాద్, కళ్యాణి, సీనియర్, ఏపీపీలు, పీపీలు, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తులను కలిసిన ఎస్పీ, అదనపు కలెక్టర్లు
జిల్లా కోర్టులో సెకండ్ అడిషనల్ జూనియర్ కోర్టు ప్రారంభానికి వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు మాధవిదేవి, శ్రీనివాసరావును శనివారం ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు.